తెలంగాణ

telangana

ETV Bharat / state

Eenadu@50: రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా ఈనాడు స్వర్ణోత్సవ సంబురాలు - Eenadu Golden Jubilee celebrations - EENADU GOLDEN JUBILEE CELEBRATIONS

Eenadu 50 years celebrations : తెలుగు ప్రజల చైతన్య దీప్తి ఈనాడు స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో 'ఈనాడు' కుటుంబ సభ్యుల సమక్షంలో 50 వసంతాల పండుగను నిరాడంబరంగా నిర్వహించారు. 'ఈనాడు'లో ప్రతి ఒక్కరూ, గడిచిన అర్థ శతాబ్దంలో సాధించిన ఘనత, ఎదురైన సవాళ్లు, అధిగమించిన ప్రతికూల అంశాలు గుర్తు చేసుకున్నారు. దివంగత ఛైర్మన్‌ రామోజీరావు చూపిన మార్గంలో రాబోయే శతాబ్దానికి సరిపడా ప్రణాళికలతో ముందుకు సాగాలని దీక్షబూనారు. ప్రజా క్షేమమే ధ్యేయంగా, నవతరానికి దిక్సూచిలా నిలవాలన్న 'ఈనాడు' ఎండీ కిరణ్‌ ఆకాంక్షను 'ఈనాడు' సైన్యం ముక్తకంఠంతో సమర్థించింది.

Eenadu Golden Jubilee celebrations
Eenadu 50 years celebrations (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 10:33 PM IST

Updated : Aug 10, 2024, 10:41 PM IST

Eenadu Golden Jubilee celebrations : తెలుగు నేలపై ఈనాడు చేరని ఊరు, తెలియని గడప ఉండదు. జనం హృదయాల్లో సుస్థిరంగా నిలిచిన ఈనాడు దిన పత్రిక అర్ధ శతాబ్ద ప్రస్థానం ఓ ప్రభజనం. 46 ఏళ్లుగా అత్యధిక సర్క్యులేషన్‌తో నంబర్‌ 1 స్థానంలో నిలవడం ప్రతికా రంగంలో రికార్డు. అప్రతిహత జైత్రయాత్ర కొనసాగిస్తూ, అన్ని వర్గాలకు చేరువైన ఈనాడు స్వర్ణోత్సవ సంబురాలు వైభవోపేతంగా సాగాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఈనాడు గ్రూపు సంస్థల సారథులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈనాడు సర్ణోత్సవ వేడుకలకు ప్రయోక్తలుగా ఈనాడు తెలంగాణ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌, పద్మశ్రీ వ్యవహరించారు. ఈనాడు మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌, రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఈనాడు డైరెక్టర్ ఐ.వెంకట్, ఈటీవీ సీఈవో బాపినీడు, ఈనాడు గ్రూప్‌ ప్రెసిడెంట్‌ హెచ్‌ఆర్ గోపాలరావు, కంపెనీ సెక్రటరీ జి.శ్రీనివాస్‌, ఆర్థిక సలహాదారు జి.సాంబశివరావు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ఈనాడు అసోసియేట్‌ ఎడిటర్ కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేశారు.

మూడు తరాలతో అనుబంధం : ఈనాడుకు మూడు తరాల పాఠకులతో అనుబంధం ఉందని, వచ్చే మూడు తరాలు కూడా ఈనాడు వెంటే ఉండేలా ప్రణాళికలు వేసుకోవాలని ఎండీ కిరణ్‌ దిశానిర్దేశం చేశారు. ఈనాడు సైన్యం ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజలు పాఠకులకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక్కో రామోజీరావై పని చేయాలని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ కోరారు. ఈనాడు జైత్రయాత్ర ఇలాగే కొనసాగాలని ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి అన్నారు.

"ఛైర్మన్ రామోజీరావు ఎప్పుడూ ఒక్క విషయం చెప్పేవారు. మీరు తప్పు చేయనంత వరకు నా అంత బలవంతుడు లేడు. మీరు తప్పు చేసినట్లయితే నా అంత బలహీనుడు లేడని అనేవారు. ప్రజా సమస్యలపై ఈనాడు ఎంతో పోరాటం చేసింది. ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒక్కో రామోజీరావై పని చేయాలి". - శైలజా కిరణ్, ఎండీ మార్గదర్శి

ఛైర్మన్‌ వీలునామా ఆకళింపు చేసుకుని : 2030 వరకు 20 లక్షల సర్క్యులేషన్‌ సాధించాలని ఈనాడు డైరెక్టర్‌ ఐ.వెంకట్‌ లక్ష్యాన్ని నిర్దేశించారు. రామోజీరావు అందించిన విలువలు, వారసత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలని ఈటీవీ సీఈవో బాపినీడు కోరారు. నిబద్దత, క్రమశిక్షణే ఈనాడు విజయ రహస్యమని ఈనాడు ఆర్థిక సలహాదారు సాంబశివరావు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మెరుగులు అద్దుకుని పాఠకుల ముందుకువస్తామని ఈనాడు కంపెనీ సెక్రటరీ జి.శ్రీనివాస్‌ చెప్పారు. ఛైర్మన్‌ రాసిన వీలునామా ఆకళింపు చేసుకుని, సంస్థ పురోభివృద్ధికి పునరంకితం కావాలని గ్రూప్‌ హెచ్.ఆర్. ప్రెసిడెంట్‌ ఎ.గోపాలరావు ఆకాంక్షించారు.

రాజ్యం ఎంత శక్తిమంతంగా దాడి చేసినా, చెక్కుచెదరకుండా ఉండే బలమైన వ్యవస్థను రామోజీరావు నిర్మించారని ఈనాడు తెలంగాణ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌ చెప్పారు. విశ్వసనీయత, నిర్భీతి, ధీరత్వమే ఈనాడుకు అజేయ శక్తి అని ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎండీ నాగేశ్వరరావు అన్నారు. స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈనాడు ప్రత్యేక సంచికను ఐ.వెంకట్‌ ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఈనాడు ఎండీ కిరణ్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో రామోజీరావు కుటుంబ సభ్యులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

"ఈనాడు సైన్యం ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. నిత్య నూతనత్వంతో పాఠకులకు మరింత చేరువ కావాలి. ఈనాడుకు మూడు తరాల పాఠకులతో అనుబంధం ఉంది. వచ్చే మూడు తరాలు కూడా ఈనాడు వెంటే ఉండేలా ప్రణాళికలు వేసుకోవాలి. మాధ్యమం ఏదైనా పాఠకులకు అవసరమైన సమాచారం అందించాలి. - కిరణ్, ఎండీ ఈనాడు

ఈనాడుకు వెల్లువెత్తుతున్న అభిమానం - 50 వసంతాల సందర్భంగా పాఠకుల శుభాకాంక్షలు - Eenadu 50 Years Celebrations

Eenadu@50 : తెలుగు జాతి ఆత్మాభిమానం, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా ఈనాడు అక్షర యాగం - EENADU Golden Jubilee Celebrations

Last Updated : Aug 10, 2024, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details