Huge Flood Water At Edupayala Temple :మెదక్ జిల్లాలో మంజీరా నది ఉద్ధృతికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రం గత మూడు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గర్భ గుడి ముందు ఉన్న నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో గర్భగుడిలోకి వెళ్లడం, పూజలు చేయడం కష్టంగా మారింది. అటు భక్తులు కూడా ఆలయానికి వచ్చే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా ప్రధాన ఆలయాన్ని మూసివేశారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు : భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడే అమ్మవారి దర్శనం కల్పిస్తూ తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామునే ఆలయ అర్చకులు, అమ్మవారికి మంజీరా జలాలతో అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. వరద తీవ్రత తగ్గగానే యధావిధిగా మూల విరాట్ దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.