ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు - విచారణకు రాకుండా కుంటి సాకులు - ED NOTICES TO VIJAYASAI REDDY

కాకినాడ పోర్ట్, సెజ్‌లోని షేర్లను బలవంతంగా లాగేసుకున్న కేసు - విజయసాయితో పాటు విక్రాంత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి, 'పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్​ సంతానం' ఎల్‌ఎల్‌పీకి సైతం నోటీసులు

ED_Notices_to_Vijayasai_Reddy
ED Notices to Vijayasai Reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 10 hours ago

ED Notices to Vijayasai Reddy: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్‌ లిమిటెడ్‌ (KSPL), కాకినాడ సెజ్​లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఈడీ (Enforcement Directorate) ఉచ్చు బిగిస్తోంది. కేఎస్‌పీఎల్‌ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (KV Rao) ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ, ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్‌ జరిగినట్లు గుర్తించింది.

దాని ఆధారంగా మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (Prevention of Money Laundering Act) కింద అభియోగాలు మోపి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్‌ఫర్మేషన్‌ రిపోర్టు (ECIR) నమోదు చేసింది. కేసులో నిందితులైన వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వై.విక్రాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్‌ శ్రీధర్‌ అండ్‌ సంతానం ఎల్‌ఎల్‌పీ ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలంటూ నోటీసులలో ఆదేశించింది.

నేను ఎక్కడికి వెళ్లాలన్నా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి

విచారణకు రాకుండా సాకులు: ప్రస్తుతం పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నందున తాను విచారణకు రాలేనంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేనంటూ విక్రాంత్‌రెడ్డి, ప్రస్తుతం విచారణకు రావటం కుదరదంటూ శరత్‌చంద్రారెడ్డి, ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణాలు చెప్తూ ఈడీ విచారణకు గైర్హాజరైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

బలవంతంగా వాటాలు లాగేసుకున్న వ్యవహారంలో రికార్డుల ప్రకారం అంతిమ లబ్ధిదారైన అరబిందో రియాల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ప్రస్తుతం అరో ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌), దాని డైరెక్టర్లకు కూడా ఈడీ నోటీసులు ఇవ్వనుంది. వీరిని విచారించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది. మరోవైపు, ఇదే కేసులో ఏపీ సీఐడీ సైతం చర్యలు వేగవంతం చేసింది. విచారణకు హాజరుకావాలంటూ శరత్‌చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది. తర్వాత మిగతా వారికి కూడా విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతోంది.

సెజ్‌లో వాటాలు గుంజుకున్న కేసులో కొత్త కోణాలు

బలవంతంగా వాటాలు బదలాయించుకుని: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుట్ర మేరకు అక్రమ కేసులు పెడతామని, అరెస్టు చేసి జైలుకు పంపిస్తామంటూ బెదిరించి, ఒత్తిడి చేసి కాకినాడ సీ పోర్ట్స్‌ లిమిటెడ్‌లోని 2 వేల 500 కోట్ల రూపాయల విలువైన వాటాలను 494 కోట్ల రూపాయలకు, కాకినాడ సెజ్‌లోని 1,109 కోట్ల రూపాయల విలువైన వాటాలను 12 కోట్ల రూపాయలకు బలవంతంగా అరబిందో సంస్థకు బదలాయించుకున్నారనే ఫిర్యాదుపై సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసింది.

మొత్తంగా 3 వేల కోట్ల రూపాయల మేర దోచుకున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. నేరపూరిత బెదిరింపు, వ్యవస్థీకృత నేరం, నేరానికి ప్రేరేపించడం, ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద అభియోగాలను మోపింది. ఇందులో మనీ లాండరింగ్‌ అంశం ముడిపడి ఉండటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సైతం రంగంలోకి దిగింది.

'రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలి' - విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టు​ షాక్​

లోతైన దర్యాప్తు:కేఎస్‌పీఎల్, కేసెజ్‌లలోని వాటాలను కొట్టేసేందుకు నాటి సీఎం వైఎస్ జగన్‌ ప్రణాళిక రూపొందించగా, విక్రాంత్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి అమలు చేశారని కేవీ రావు తెలిపారు. అందులో భాగంగా కేఎస్‌పీఎల్‌లో స్పెషల్‌ ఆడిట్‌ చేయించారని, లేని ఆదాయం ఉన్నట్లు తప్పుడు దస్త్రాలు సృష్టించారని ఆరోపించారు. కేఎస్‌పీఎల్‌ ప్రభుత్వానికి 965.65 కోట్ల రూపాయల వాటా చెల్లించాలంటూ ఆడిట్‌ సంస్థతో రిపోర్టు ఇప్పించారని అన్నారు.

దాన్ని చూపించి తనపై, తన కుటుంబసభ్యులపై అక్రమ కేసులు పెట్టారని పేర్కొన్నారు. అరెస్టు చేస్తామని బెదిరించారని, వాటా కొనుగోలు ఒప్పందాలపై మోసపూరితంగా సంతకాలు చేయించుకున్నారని వెల్లడించారు. అరబిందో సంస్థ పేరిట వాటాలు బదలాయించుకున్నారని, షేర్‌ విలువ మదింపులోనూ సరైన విధానం పాటించలేదని కేవీ రావు తెలిపారు. కేఐహెచ్‌పీఎల్‌ను తీవ్రంగా మోసగించారంటూ కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశాలన్నింటిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ లోతుగా దర్యాప్తు చేస్తోంది. వాటాల బదిలీకి ముందు, అనంతరం జరిగిన వ్యవహారాలపై కీలక ఆధారాలు సేకరించింది.

విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు - Vijayasai Daughter Place issue

ABOUT THE AUTHOR

...view details