EC Warning to Jagan and Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడులు ఎన్నికల ప్రచారంలో పరస్పరం చేసుకుంటున్న విమర్శలు ఆరోగ్యకరంగా లేవని, మున్ముందు జరిగే ప్రచారంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఇరువురు నేతలు పార్టీలకు అధ్యక్షులే కాకుండా, ఆయా పార్టీలకు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌లుగా ఉన్నారని, ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే విధంగానే ఉన్నాయని ఈసి అభిప్రాయపడింది.
ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో చంద్రబాబుపై జగన్ మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని టీడీపీ నేతలు పిర్యాదు చేశారు. అదే సందర్భంలో, ఏప్రిల్ 5, 6, 10, 15, 17వ తేదీల్లో పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌ను పరుషపదజాలంతో దూషించారని వైఎస్సార్సీపీ పిర్యాదు చేసింది.
రెండు పార్టీల నేతలు చేసిన పిర్యాదులపై అందుబాటులో ఉన్న అన్ని రికార్డులు, రాష్ట్ర సీఈఓ నివేదికను జాగ్రత్తగా పరిశీలించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పలు మార్లు ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. జగన్ మోహన్ రెడ్డి ప్రచార సమయంలో చేసిన మాటలు ముఖ్యమంత్రిగా ఉన్నత పదవిలో ఉన్న నాయకుడిలా లేవన్న ఈసీ, భవిష్యత్‌లో బహిరంగంగా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈసీఐ మార్గదర్శకాలు, సూచనలను పదేపదే ఉల్లంఘించారని కమిషన్ అభిప్రాయపడుతూ భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.