EC Instructions to Political Parties : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలోని రాజకీయ పార్టీలకు భారత ఎన్నికల సంఘం పలు ఆదేశాలు జారీచేసింది. ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండటం కోసం, అలాగే ప్రచారంలో పారదర్శకత నిర్థారించేలా ఈసీ అన్ని రాష్ట్రాలు పాటించాలని ఆదేశించింది. తద్వారా ప్రచారానికి అయ్యే వ్యయాన్ని నియంత్రించడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి ఉల్లంఘనలు లేకుండా చూసేందుకు అవకాశం ఉంటుందని ఈసీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ నిఘా- రాష్ట్రంలో పరిస్థితులపై ప్రత్యేక పరిశీలకులు
పేరు లేని అజ్ఞాత హోర్డింగ్‌లు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేసేందుకు వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు చర్యలు చేపట్టాల్సిందిగా మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంబంధిత మెటీరియల్‌పై ప్రింటర్ పబ్లిషర్‌ల స్పష్టమైన గుర్తింపు ఉండాలని స్పష్టం చేసింది. ప్రచారంలో పారదర్శకత నిర్ధారించేలా భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
ప్రచారంలో పారదర్శకత కోసం ఈసీ ఆదేశాలు :మున్సిపల్ అధికారుల నియంత్రణలో ఉన్న హోర్డింగ్ స్థలాల్లో గుర్తింపు లేకుండా హోర్డింగ్‌లు ఉన్నాయని కమిషన్‌కు ఫిర్యాదులు అందడంతో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 127A ప్రకారం ప్రింటర్ లేదా ప్రచురణకర్త పేరు, చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ప్లకార్డులు బ్యానర్‌లను ప్రదర్శించడం నిషేధిస్తున్నట్టు ఈసి ఆదేశాలు జారీ చేసింది.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ తేదీని మార్చండి : నీట్ పరీక్ష దృష్ట్యా ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ తేదీని మార్చాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ సీఈఓకి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు నిర్దేశించిన మే 5, 6 తేదీల్లో నీట్ పరీక్ష జరుగనున్న దృష్ట్యా పోస్టల్ బ్యాలెట్‌ను వాయిదా వేయాలని కోరారు. పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ల కోసం కేటాయించిన మే 5 వ తేదీని మార్చాలన్నారు. మెప్మాలోని సీఎల్ఆర్పీలు, ఆర్పీలపై ఓత్తిడి తెచ్చి పొదుపు సంఘాల మహిళలను ప్రభావితం చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో నూతనంగా వచ్చిన ఓటర్ల జాబితాలోనూ తప్పులు దొర్లాయని వీటిపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసారు.