Special Trains for Araku Valley :అందమైన పర్వతాలు. పాలధారను తలపించే జలపాతాలు. ఓవైపు కాఫీ తోటలు మరోవైపు చూపు తిప్పుకోనివ్వని మంచు గిరులు, జల సవ్వళ్లు. ఇలా ఒకటేమిటి ఎన్నో సుందర మనోహర దృశ్యాలు. వింటేనే మనసు పులకరించిపోతుంది కదూ. ఇలా ఒక్కటేమిటి అరకు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మంచు పొరల చాటున కనిపించే అందాల గురించి చెప్పడం కాదు అక్కడికి వెళ్లి చూడాల్సిందే! శీతాకాలంలో అరకు మరింత రమణీయంగా ఉంటుంది. అణుఅణువు ప్రకృతి రమణీయత తాండవిస్తుంది.
పాల కడలిని తలపించే మంచు సోయగాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. పాడేరు చుట్టు పక్కల పచ్చని కొండల మధ్య తేలియాడే మేఘాలు భూమిని తాగుతున్న అందాలు కట్టిపడేస్తాయి. ప్రకృతి అందాల నడుమ ఫొటోలు దిగుతూ ఆనంద పరవశ్యంలో మునిగి తేలుతారు. తాజాగా అరకు పర్యాటకులకు తూర్పు కోస్తా రైల్వే శుభవార్త చెప్పింది. సందర్శకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ నుంచి ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ పేర్కొన్నారు.
ఈనెల 28 నుంచి జనవరి 19 వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 8:30 గంటలకు విశాఖలో రైలు బయల్దేరి ఉదయం 11:45 గంటలకు అరకు చేరుకోనున్నట్లు డీసీఎం కె.సందీప్ వివరించారు. తిరుగు ప్రయాణంలో అదే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకోనున్నట్లు తెలిపారు. ఒక సెకెండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్, 4 సాధారణ రెండో తరగతి, 2 జనరల్ కమ్ లగేజీ బోగీలతో ఈ ట్రైన్ సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు తెలియజేశారు. పర్యాటకులు గమనించి ఈ రైలు సేవలు వినియోగించుకోవాలని కె.సందీప్ కోరారు.