Drone Videography in Celebrations : ఏదైనా కార్యక్రమం ఘనంగా జరిగితే సంబరాలు అంబరాన్నంటాయని వర్ణిస్తుంటారు. ప్రస్తుతం డ్రోన్లు, డ్రోన్ కెమెరాలు ఆ మాటను నిజం చేసి చూపిస్తున్నాయి. జీవితంలో ప్రతి వేడుకను మధుర జ్ఞాపకంగా మలచుకోవాలని అందరూ కోరుకుంటారు. అందులో భాగమే ఫొటోలు, వీడియోలు, విందులు, వినోదాలు. తాజాగా ఆ జాబితాలో డ్రోన్ వీడియోగ్రఫీ చేరింది. హైదరాబాద్ సహా నగరాలు, పట్టణాల్లో జరిగే చాలా వేడుకల్లో డ్రోన్ తప్పనిసరిగా మారింది. ఖర్చుకు వెనకాడకుండా వీటిని వినియోగిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ట్రావెల్ వ్లాగర్లు, యూట్యూబర్లు తమ చిత్రీకరణల్లో డ్రోన్ షాట్లను భాగం చేస్తున్నారు. మరోవైపు పోలీసుల నిఘా అస్త్రంగానూ డ్రోన్ ఉపయోగపడుతోంది. ర్యాలీలు, ఉత్సవాల్లో వీటి సాయంతోనే ఆకతాయిలు, సంఘ విద్రోహశక్తులు చొరబడకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
నగరంలో జోరందుకుంటున్న వినియోగం : గత సంవత్సరం అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవంలో 800 డ్రోన్లతో హైదరాబాద్‌లో తొలిసారి ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత దుర్గం చెరువు వద్ద, వింగ్స్ ఇండియా 2024, పోలీస్ అకాడమీలో చేపట్టిన డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయి. సాధారణ వీడియోగ్రాఫర్లు సైతం వీటిపై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. వివాహాల చిత్రీకరణకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ప్యాకేజీలు ఉంచుతున్నారు. వ్యక్తిగత డ్రోన్ల ఖరీదు రూ.45,000 నుంచి రూ.లక్ష. వేడుకలకు సంబంధించి రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలని డ్రోనికా ఇన్నొవేషన్స్ ప్రతినిధి అశోక్ వివరించారు. సినిమాలకు వినియోగించేవి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటాయని పేర్కొన్నారు.
వందల డ్రోన్లు ఒకచోటకు చేరి :ఇంటి శుభకార్యాలతోపాటు గ్రామాల్లో జాతరలు, ఉత్సవాల్లోనూ డ్రోన్ వీడియోగ్రఫీ భాగమైంది. వివాహాలు, పుట్టినరోజులు ఇతర వేడుకల్లో దీని కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. కొందరు యువకులు తమ గ్రామాలపై ప్రేమను వ్యక్తం చేస్తూ డ్రోన్లతో వీడియో డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తున్నారు. ఏరియల్ వ్యూలో తమ ఊరి అందాలను చూసి స్థానికులతోపాటు దేశవిదేశాల్లో స్థిరపడిన వారు సంతోషపడుతున్నారు.