Driving School Trainer Impressed with his Stunts:రోడ్ల మీద తడబాటు లేకుండా వాహనాలు నడపడానికి ఆపసోపాలు పడతాం. కానీ ఆ కుర్రాడు మాత్రం అవలీలగా కారును నడిపేస్తాడు. రద్దీగా ఉన్న రోడ్లపైనా 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాడు. ఎలాంటి బెరుకు, తడబాడు లేకుండా కాళ్లనే చేతుల్లా వాడుతూ స్టీరింగ్ తిప్పుతూ గేర్లు మారుస్తూ ఇండికేటర్స్ వేసేస్తాడు. ఇవేవో హాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో హీరోలు చేసే స్టంట్స్ కావు విజయనగరంలో ఓ డ్రైవింగ్ స్కూల్ శిక్షకుడి విన్యాసాలు.
విజయనగరంలోని ఓ కారు డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గంటా శివకృష్ణ అనే వ్యక్తి 17 ఏళ్లుగా శిక్షకుడిగా కొనసాగుతున్నాడు. ఆ అనుభవంతో డ్రైవింగ్ విన్యాసాలపై స్వతహాగా పట్టు సాధించాడు. భిన్నంగా కారు నడపడంలో మెళకువలు నేర్చుకున్నాడు. హాలీవుడ్, బాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తరహాలో అబ్బురపరిచేలా విన్యాసాలు చేస్తున్నాడు. కదులుతున్న కారు నుంచి అమాంతం దిగడం, బ్యానెట్, కారు టాప్‌పై ఆసనాలు వేయడం రెండు డోర్లపై పడుకొని, వెనుక సీట్లలో కూర్చొని డ్రైవింగ్ చేయడం ఇలా ఎన్నో విన్యాసాలతో ఆకట్టుకుంటున్నాడు. అత్యంత రద్దీ రహదారుల్లో స్టీరింగ్ పట్టుకోకుండా వంద కిలోమీటర్ల వేగంతో గంటా శివకృష్ణ దూసుకుపోతుంటాడు. కాళ్లతో స్టీరింగ్ తిప్పుతూ గేర్లు మారుస్తూ ఇండికేటర్స్ వేస్తుంటాడు. ఎక్సలేటర్, బ్రేక్‌లను చాకచక్యంగా కంట్రోల్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు.