Diviseema Flood Threat Looms : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం, కృష్ణా నదిలో పెరుగుతున్న వరద దివిసీమ ప్రజలను వణికిస్తున్నాయి. దీంతో వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గతంలో వరదలకు లోతట్టు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు, పంటలు నీట మునిగేవి. ఇప్పుడు మళ్లీ ప్రకాశం బ్యారేజీ నుంచి పరవళ్లు తొక్కుతూ వస్తున్న కృష్ణా వరద దివిసీమను కునుకులేకుండా చేస్తోంది.
ముంపు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు : పులిగడ్డ అక్విడక్ట్ వద్ద ఇప్పటికే 20 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ప్రవాహ ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కె.కొత్తపాలెం, దక్షిణ చిరువోల్లంక, పాతఎడ్లంక, పులిగడ్డ, అముదార్లంక, అవనిగడ్డలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Heavy Rains in AP :మోపిదేవి మండలం, ఉత్తర చిరువ్లోల్లంక వద్ద లాకులు నుంచి వరద నీరు కరకట్ట లోపలికి వస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలో నాటు పడవలు వినియోగించొద్దని చెప్పారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. మరోవైపు ముంపు బాధితులు భయం భయంగా కాలం గడుపుతున్నారు. ఇంకా వరద ప్రవాహం పెరిగితే లంకల్లో సాగు చేసిన పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.