Diviseema Flood Threat Looms :విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికీ దివిసీమలో వరద కొనసాగుతూనే ఉంది. దివిసీమ వరదలు మిగిల్చిన నష్టం అపారమని, ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందిజేసి రైతన్నలను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో వివిధ పంటలు నీటమునిగాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి మండలం, బోబర్లంక జలమయమైంది. గ్రామంలో 10 అడుగుల ఎత్తులో వరద ప్రవహిస్తోందని గ్రామస్థలు ఆందోళన చెందుతున్నారు. వరద బాధితులందర్నీ పునరావాస కేంద్రాలకు తరలించారు.
'ఎగువన కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో దివిసీమ కు వచ్చిన వరద నీటి వలన మెట్ట పొలాలు (వాణిజ్య పంటలు) పంట చేతికి రాకముందే నీటిపాలు అయ్యాయి. ఆక్వా రంగం కూడా పూర్తిగా కుదేలయ్యింది. కృష్ణానది పక్కన ఉన్న రొయ్యలు, చేపల , పీతల చెరువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాలలో వాణిజ్య పంటలైన అరటి, కంద, పసుపు, మొక్కజొన్న తదితర పంటలు వరద నీటిలో మునిగి పూర్తిస్థాయిలో నష్టపోయాం.' - బాధిత రైతులు