Ram Gopal Varma Case :సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ పోలీసుల విచారణకు రెండోసారి గైర్హాజరయ్యారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్‌ను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ ఆయనపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఆయనపై ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ రామ్‌గోపాల్‌వర్మ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు 4 రోజుల సమయం కావాలంటూ ఆర్జీవీ అదేరోజు వాట్సప్‌లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు. అనంతరం 25న ఉదయం విచారణకు హాజరుకావాలంటూ మరోసారి రామ్‌గోపాల్‌వర్మకి నోటీసులు ఇచ్చారు.
Police on Ram Gopal Varma : ఇవాళ కూడా రామ్‌గోపాల్‌వర్మ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే ఆయన అరెస్టుకు ఒంగోలు పోలీసులు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి చేరుకున్నారు. అయితే ఆర్జీవీ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఓ వివాహానికి హాజరైనట్లు ట్వీట్ చేశారు. మరోవైపు డిజిటల్ మోడ్‌లో విచారణకు హాజరవుతానని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. అయితే డిజిటల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు చెప్పారు.