Parchur Fire Accident : ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి రాత్రి భోజనం చేశారు. సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వారంతా నిద్రకు ఉపక్రమించారు. కానీ అదే వారికి చివరి రోజు అవుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆకస్మాత్తుగా ఆ ఇంట్లో మంటలు చేలరేగాయి. వెంటనే తెరుకున్న ఆ తల్లి బిగ్గరగా కేకలు వేసింది. తన ఇద్దరు కుమార్తెలను కాపాడుకునే ప్రయత్నం చేసింది.
కానీ ఆ తల్లి ప్రయత్నాలు విఫలమై మంటల్లో చిక్కుకొని ఆ ఇద్దరు సజీవదహనమయ్యారు. తన కళ్ల ఎదుటే కుమార్తెల మృతిని చూసి ఆ మాతృమూర్తి తట్టుకోలేక ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పర్చూరులోని రామాలయం వీధిలో దాసరి వెంకటేశ్వర్లు నివాసం ఉంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఆ ఇంట్లో మంటలు వ్యాపించాయి. వెంటనే తేరుకున్న తల్లి లక్ష్మీ రాజ్యం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
Fire Accident in Bapatla District :ఈ క్రమంలోనే ఇంట్లో ఆమె ఇద్దరు కుమార్తెలు చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు ఆ మాతృమూర్తి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంటలు చుట్టుముట్టడంతో కదలలేని స్థితిలో ఉన్న ఆ అక్కాచెల్లెళ్లు నాగమణి, మాధవిలత సజీవదహనమయ్యారు. కళ్ల ముందే కుమార్తెలు సజీవదహనమైపోవడాన్ని తట్టుకోలేక ఆ తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కలిచివేసింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేలోగా ఈ ఘోరం జరిగిపోయింది.
అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన తల్లి లక్ష్మీరాజ్యంను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పరిశీలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? లేదా ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో విచారణ చేస్తున్నట్లు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ వెల్లడించారు.
Minister Gottipati on Parchur Fire Accident : పర్చూరు అగ్నిప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అక్కాచెల్లెళ్లు చనిపోవడం బాధాకరమని అన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని గొట్టిపాటి రవికుమార్ భరోసానిచ్చారు.
షార్ట్ సర్క్యూట్‌తో బస్సు దగ్ధం - తప్పిన ప్రాణ నష్టం
ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్, పేలిన గ్యాస్ సిలిండర్ - ఎక్కడంటే?