Devineni Uma Fire on Visakha Police Filing Case Against Media:బాధితుల గొంతు వినిపించిన మీడియాపై విశాఖ పోలీసులు కేసు పెట్టడంపై తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశమంతా చూస్తోందని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టినవాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని దేవినేని ఉమ హెచ్చరించారు. తాడేపల్లి ఆదేశాల మేరకు సీఎస్ నేతృత్వంలోనే కుట్ర జరుగుతోందన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ వ్యవహారశైలిని ఈసీ కట్టడి చేయాలని కోరారు. విశాఖలో బాధితులు గోడు చెప్పుకుంటే ఆ బాధను ప్రసారం చేసిన ఛానళ్లపైనా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. మీడియా స్వేచ్ఛపైనా దాడి చేసే పరిస్థితికి వచ్చారని అన్నారు.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతల అరాచకాలను ప్రజలకు తెలియజేయడం తప్పా అని దేవినేని ప్రశ్నించారు. ప్రభుత్వం అధికారులు, పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలే పాటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత జరిగిన హింస కావాలనే వైఎస్సార్సీపీ చేసిన కుట్ర అని మండిపడ్డారు. మహిళలపై దాడి జరిగిన తీరు చూస్తే చాలా బాధేస్తోందని అన్నారు. సీఎం జగన్ కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని తమ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతోనే దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈసీ, సిట్ అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుచేసిన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డి కూడా బాధ్యత వహించాల్సిందేనని దేవినేని అన్నారు.