Deputy CM Pawan Kalyan About Ramoji Rao : మొదటిసారి 2008లో రామోజీరావును కలిశానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మాట్లాడే విధానం తనను చాలా ఆకర్షించిందని చెప్పారు. ప్రజాసంక్షేమం కోణంలోనే ఎప్పుడూ మాట్లాడేవారని, ఆ మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయని తెలిపారు. విజయవాడలోని కానురూలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రజాసమస్యల గురించే రాసేవారు : అంతకుముందు రామోజీరావు ఛాయాచిత్ర ప్రదర్శనను పవన్ కల్యాణ్ తిలకించారు. అనంతరం ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీరావు వివరించారని పవన్ తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని ఆయన అనేవారని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా జర్నలిజం విలువలు వదల్లేదన్నారు. పాలన సరిగా లేకుంటే పత్రిక మొదటి పేజీలో విమర్శించేవారని గుర్తు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పత్రికలో ప్రజాసమస్యల గురించే రాసేవారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
'2008లో వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజలకు తెలియాలనే అంశంపై రామోజీరావు ఉద్యమకారుడిలా మారారు. సినిమా రంగంలో ఇతర అంశాల్లో రాణించినప్పటికి ఆయన నిజమైన జర్నలిస్టు. కుటుంబాన్ని బెదిరించినా రామోజీరావు వెరవకుండా ఎదురు నిలబడ్డారు. అలాగే చాలా సాహసం చేశారు. ఈనాడు, ఈటీవీలు ఎంత విలువ ఇస్తాయో అంతే స్థాయిలో విమర్శలు చేస్తాయి. విలువలతో కూడిన జర్నలిజం అది. ఆ వారసత్వ ప్రవాహాన్ని అలాగే కొనసాగించాలి' అని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.