PAWAN KLAYAN SPPECH AT GAME CHANGER: సినిమా టికెట్ ధరల పెంపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో జరిగిన గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందని అన్నారు. టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని, ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున గేమ్ ఛేంజర్ సినిమాకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సినిమా తీసేవాళ్లే మాట్లాడాలి: గత ప్రభుత్వం భీమ్లానాయక్ చిత్రానికి టికెట్ ధర పెంచలేదని, చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం తమకు ఇష్టం లేదన్నారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని కాదని, భారతీయ సినిమా పరిశ్రమ అనేదే మన నినాదమని వ్యాఖ్యానించారు. హాలీవుడ్ పద్ధతులు పాటించకపోయినా అందులోని ‘వుడ్’ మాత్రం తీసుకున్నామని, మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపాలని పవన్ సూచించారు. చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ రావాలని, ఇండస్ట్రీ గురించి ఏదైనా మాట్లాడాలంటే సినిమా తీసేవాళ్లే మాట్లాడాలని అన్నారు.
ధరల విషయంలో హీరోలతో పనేంటి?: సినిమాలు తీస్తే వాళ్లతోనే తాము మాట్లాడుతామని స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేంటని ప్రశ్నించారు. నిర్మాతలు రావాలని, హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలనేంత కిందిస్థాయి వ్యక్తులం తాము కాదని పేర్కొన్నారు. ప్రస్తుతం తామంతా ఎన్టీఆర్ వేసిన బాటలో నడుస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. సినీ పరిశ్రమపై తమ ప్రభుత్వానికి గౌరవం ఉందని, సినీ పరిశ్రమను చంద్రబాబు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారని అన్నారు.