Pawan Kalyan South India Temples Tour: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన కొనసాగుతోంది. ఆయన అక్కడ ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించనున్నారు. వైరల్ జ్వరం నుంచి కోలుకున్న పవన్ సనాతన ధర్మపరిరక్షణలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. మూడు రోజులపాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని దేవాలయాలను సందర్శిస్తారు.
అగస్త్య మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు:దీనిలో భాగంగా బుధవారం (12/02/2025) కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన కుమారుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్‌సాయి ఉన్నారు. ఈ క్రమంలో కేరళ సంప్రదాయంతో ఆలయ పండితులు పవన్‌కి స్వాగతం పలికారు. అగస్త్య మహార్షికి పవన్ సంప్రదాయబద్ధంగా మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఆకృతిని, కట్టడాలను ఆసక్తిగా పరికించారు. ఆశ్రమంలో ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే మూలికలు, మొక్కల గురించి ఆశ్రమ వైద్యులు విష్ణు యోగి, మణి యోగి వివరించారు.
ఆయుర్వేద చికిత్సపై ఆరా: ఈ ఆశ్రమానికి దూర ప్రాంతాల నుంచి వివిధ ఆరోగ్య సమస్యలకు చికిత్స నిమిత్తం ప్రతి రోజు 200 మందికి పైగా వస్తుంటారు. సుమారుగా 100 పడకల ప్రత్యేక వైద్యశాల వీరికి ఉంది. దీనికోసం 12 మంది వైద్యులతోపాటు సిబ్బంది ఇక్కడ పని చేస్తుంటారు. వివిధ దీర్ఘకాలిక నొప్పులు అలాగే ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారికి వీరు ప్రత్యేకంగా ఆయుర్వేదంతోపాటు మర్మ చికిత్సను చేస్తారు. ఆయుర్వేదం మనిషిపై ప్రభావం చూపడానికి కాస్త సమయం తీసుకుంటుంది కాని కచ్చితంగా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిదని వైద్యులు పవన్‌కు వివరించారు. పవన్‌ని బాధపెడుతున్న నడుము నొప్పి, స్పాండిలైటిస్ సమస్యకు ఆయుర్వేదంలో అవలంబించే చికిత్స విధానాలను ఆశ్రమ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.