Deputy CM Pawan Kalyan Meets Hindupur Former Naveen :'ఈటీవీ భారత్' కథనానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి మంగళగిరికి ఎడ్లబండిలో వచ్చి తనను కలిసేందుకు నిరీక్షించిన నవీన్ అనే యువరైతును పవన్ కల్యాణ్ కలిశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్న పవన్ కల్యాణ్ రోడ్డు పక్కనే ఉన్న రైతుని కలిశారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారని పవన్ కళ్యాణ్ రైతును అడగగా పండించిన పంటకు గిట్టుబాటు దొరకటం లేదని ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు.
అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను రైతు వివరించాడు. పంట ఉత్పత్తులను అమ్ముకోలేక పోతున్నామని, దళారుల బెడద ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దీంతో రైతుల సమస్యలపై తన కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వాలని రైతుకి పవన్ సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన (Droupadi Murmu AP Tour) వల్ల అధిక సమయం కేటాయించలేక పోతున్నానని తెలిపారు.
Young Farmer Bullock Cart Yatra to Amaravati :దళారీ వ్యవస్థతో రైతులు నష్టపోతున్న తీరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెప్పాలని యువ రైతు నిర్ణయించుకున్నాడు. రైతులు సాగులో నష్టాన్ని ఎదుర్కోలేక బలవంతపు చావులకు పాల్పడుతున్న తీరుతో తీవ్ర ఆవేదన పడ్డాడు. ఒకరు, ఇద్దరు రైతులకైతే ఏదైనా సహాయపడవచ్చు కానీ రాష్ట్రంలో నష్టపోతున్న తోటి రైతులకు ఏదో ఒకటి చేయాలని తపించాడు. రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలపడానికి గతంలో ఏ రైతు చేయని ప్రయత్నం చేస్తూ తన సొంత గ్రామం నుంచి ఎడ్లబండిపైనే అమరావతికి వెళ్లి రైతుల కష్టాలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెప్పడానికి పయనమయ్యాడు. దాదాపు 28 రోజుల్లో 760 కిలోమీటర్లు ప్రయాణించి మొత్తానికి మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నాడు.
పవన్‌ను కలిసేందుకు అనుమతించాలన్న యువ రైతు : శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటకు చెందిన నవీన్ కుమార్ అనే యువ రైతు తమ కష్టాలను వివరించేందుకు మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుటే మూడు రోజులుగా వేచిచూశాడు. అన్నదాతల సమస్యలను పవన్‌కు చెప్పేందుకు హిందూపురం నుంచి ఎడ్లబండిపై వచ్చినట్లు కార్యాలయ సిబ్బందికి తెలియజేశాడు. పవన్ కల్యాణ్ పిలుపు కోసం దాదాపు మూడు రోజులుగా మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుటే రైతు నవీన్ ఎదురుచూశాడు. కార్యాలయం గేటు బయటే చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ ఇబ్బంది పడ్డారు. చలి తీవ్రత కారణంగా తన ఎద్దులు సైతం అనారోగ్యానికి గురవ్వడం బాధాకరం, ఎడ్లకు తినడానికి గడ్డి కూడా లేదంటూ మేత ఇవ్వాల్సిందిగా చుట్టపక్కల రైతులను ప్రాధేయపడ్డారు. రైతుల కష్టాలను వివరించేందుకు వ్యయప్రయాసలకోర్చి ఎంతో దూరం నుంచి వచ్చిన తనను ఉపముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని నవీన్ కార్యాలయ సిబ్బందిని అభ్యర్థించారు.
పవన్ కళ్యాణ్‌ని కలవాలని ఎడ్లబండిపై వచ్చిన రైతు - 28 రోజులు 760కి.మీ. ప్రయాణం