Pawan Kalyan Emotional Tweet: తిరుమల లడ్డూ అపవిత్రంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుకొండలవాడా క్షమించు అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ గత పాలకుల వికృత పోకడలతో అపవిత్రమైందన్నారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకమని పేర్కొన్నారు. ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్న నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని అన్నారు.
తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం తన మనసు వికలమైందని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనన్నారు. తన వంతుగా 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని తెలిపారు. సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష ప్రారంబిస్తానని ప్రకటించారు.
11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు. భక్తులు అమృతతుల్యంగా, పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని ఆరోపించారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరని వ్యాఖ్యానించారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హైందవ జాతికే కళంకంగా అభివర్ణించారు.