Pawan Kalyan on Volunteers: జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లతో పని చేయించుకుని మోసం చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. వాలంటీర్లను నియమించినట్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేని కారణంగా వారికి ఏమీ చేయలేకపోతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్పంచుల సంఘాల నేతలతో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం అయ్యారు.
సర్పంచుల సంఘాలు లేవనెత్తిన సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని గ్రామ సర్పంచి పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్‌పై స్పందించారు. సచివాలయ సిబ్బందిని గ్రామ పంచాయతీ పరిధిలోకి తెచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. గ్రామాల స్వయం సమృద్ధి కోసం మొక్కల పెంపకాన్ని భారీ స్థాయిలో చేపడుతున్నట్లు వివరించారు. కలప ద్వారా వచ్చే ఆదాయంతో పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు.
ఆయన సహకారంతోనే గ్రామాల అభివృద్ధి: సర్పంచుల కోసం అమరావతిలో రెండు ఎకరాల్లో కమ్యూనిటీ హాలు, శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ధిక సంఘం నిధులను నేరుగా పంచాయతీల ఖాతాకే జమ చేస్తున్న విషయం గుర్తు చేశారు. సర్పంచుల డిమాండ్లలో కీలకమైనవి గుర్తించి పూర్తిచేశామని తెలిపారు. కేరళ అధికారి కృష్ణతేజను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చామన్న పవన్, ఆయన సహకారంతోనే గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని స్పష్టం చేశారు. నా పేషీలో ప్రజలకు మేలు చేద్దామన్న అధికారులు ఉండటం నా అదృష్టమని కొనియాడారు. ఎంపీ నిధుల ద్వారా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తామని అన్నారు.