Deputy CM Bhatti Review On Odisha Coal Block : సింగరేణి సంస్థకు ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్ నుంచి నాలుగు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో నైనీ బొగ్గు బ్లాకుపై ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఇతర అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఇటీవలే భట్టి విక్రమార్క, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిని కలిసి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి ప్రతిష్ట స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు.
సింగరేణి అధికారులతో భట్టి సమీక్ష :సింగరేణికి 783 హెక్టార్ల అటవీ స్థలం అప్పగింతపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించినందున ఆ రాష్ట్ర అటవీశాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పనులు వేగంగా పూర్తయ్యలా చొరవ చూపాలని భట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. స్థానిక నిర్వాసితులకు పునరావాస పథకం, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలపై తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఛెండిపడ రోడ్డును విస్తరించడం, బలోపేతం చేయడం వంటి పనులపై ఆ రాష్ట్ర ఆర్ఎండీ శాఖతో సమన్వయం చేసుకొని త్వరగా పూర్తి చేయాలని చొరవ చూపారు.