Deputy CM Bhatti Vikramarka On Indiramma Housing Scheme : ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. పిప్పిరిలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి, వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన తన పాదయాత్ర ప్రధాన కారణమని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా అంటే వెనకబడిన ప్రాంతం కాదని, రాష్ట్రంలోని మిగతా జిల్లాలకంటే అగ్రభాగాన నిలిపే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనం :వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని మళ్లీ తుమ్మిడిహెట్టి వద్దనే పునఃప్రారంభిస్తామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత పోటీపరీక్షలకు ఉపయోగపడేలా ప్రతి నియోజకవర్గంలో డా. బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జి సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ పక్కా ఇళ్లు పేరిట నియోజకవర్గానికి 3500 ఇళ్లు కేటాయించనున్నట్లు చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలైతే, ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ. లక్ష కలిపి రూ.6 లక్షల వరకు చెల్లించనున్నట్లు తెలిపారు.