Rising Dengue Fever Cases: ఆ గ్రామంలో 15 రోజుల క్రితం ఓ వృద్దురాలు టైఫాయిడ్ జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, గ్రామస్థులంతా వృద్దురాలి మరణాన్ని తెలికగా తీసుకున్నారు. పదిహేను రోజులలో గ్రామంలో అనేక మంది డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న ఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు జిల్లా అధికారులు స్పందించారు. గ్రామంలో విష జ్వరాలకు గల కారణాలను అన్వేషించడంతో పాటుగా, వైద్య శిబింరం ఏర్పాటు చేశారు.
ఏలూరు జిల్లా ఎర్రంపల్లి గ్రామంలో విష జ్వరాలు గ్రామస్థులను కలవరపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా గ్రాస్థుల్లో ఒక్కొక్కరుగా విష జ్వరాల భారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం ఎర్రంపల్లి గ్రామానికి చెందిన గోగం నాగేశ్వరమ్మ టైఫాయిడ్ జ్వరంతో మృతి చెందారు. గ్రామంలో జ్వరంతో ఓ వ్యక్తి మృతి చెందినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తూ గ్రామంలోని ఆర్ఎంపీని సంప్రదించి మందులు వాడుతూ వస్తున్నారు. అయితే, గత 10 రోజులుగా అదే గ్రామానికి చెందిన లక్కపాము ప్రియాంక (21), నాగిరెడ్డి పద్మావతి (41), తక్షీల్ (10) ముగ్గురికి జ్వరం వచ్చింది. ఎంతకీ జ్వరం తగ్గడం లేదు, పైగా ఇతరులు సైతం జ్వరం భారిన పడుతున్నారు.
ఈ నేపథ్యంలో వారంతా ప్రైవేట్ ఆసుత్రుల్లో వైద్య పరీక్షల్లో చేయించుకున్నారు. ఆ ముగ్గురికి డెంగ్యూ జ్వరం సోకినట్లు నిర్ధారణ అయింది. నాగిరెడ్డి పద్మావతి, తక్షీల్ ఏలూరు ప్రైవేటు ఆసుపత్రిలొ చికిత్స పొందుతున్నారు. లక్కపాము ప్రియాంక గ్రామంలోనే ఆర్ఎంపీ వైద్యుడి వద్దే చికిత్స పొందుతున్నారు.