Demand in Panchadara Chilakalu : గ్రామాల్లో తీర్థాలు మొదలయ్యాయి. ఈ సంబరాలు ప్రతివారిని ఆనందోత్సాహాలతో నింపుతాయి. వీటిలో పల్లెవాసుల సంప్రదాయ వంటకమైన పంచదార చిలకలకు ఈ సీజన్‌లో డిమాండ్ చాలా ఎక్కువ. పిల్లల నుంచి పెద్దలవరకు వీటిని చూసి ముచ్చటపడని వారుండరు. అనకాపల్లి జిల్లాలో వడ్డాది, చోడవరం, కశింకోట గ్రామాల్లో వీటిని తయారుచేసే కుటుంబాలు ఉన్నాయి. కశింకోట వడ్డివీధికి చెందిన కొన్ని కుటుంబాలు దశాబ్దాలుగా పిండి వంటలు తయారుచేసి సంతల్లో, సంబరాల్లో విక్రయిస్తుంటారు.
సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి పంచదార చిలకల తయారీలో నిమగ్నమవుతారు. వీటిలో గులాబీ, తెలుపు రంగులకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో వీటినే తయారు చేస్తుంటారు. వీటి తయారీకి ప్రధానంగా పంచదారను వినియోగిస్తారు. కట్టెల పొయ్యిపై పాకం తీసి అచ్చుల్లో వేసి చల్లారుస్తారు. అచ్చుల నుంచి జాగ్రత్తగా వీటిని విడదీసి బయటకు తీస్తారు. వీటిని పదిలంగా బుట్టల్లో పేర్చి అమ్మకానికి సిద్ధం చేస్తారు.
కేజీ పంచదారకు పరిమాణాన్ని బట్టి 40 చిలకల వరకు తయారు చేస్తారు. ఒక్కో దాని ధర పది నుంచి వంద వరకు ఉంటుంది. ఉపనయనాలు, బారసాల, వివాహాలు తదితర వేడుకలకు చిలకలను తయారు చేయడం వీరి ప్రత్యేకత. మరోవైపు ఏళ్ల తరబడి తమ పరిస్థితులు మారలేదని, ముడి సరకుల ధరలు పెరగడంతో ఆశించిన లాభాలు పొందలేకపోతున్నామని తయారీదారులు ఆవేదన చెందుతున్నారు.