ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కామన్ ఎంట్రెన్స్ టెస్టులు ఎప్పుడు? విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన - CONVENERS APPOINTMENT ISSUE

రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్ల నియామకంలో జాప్యం - టీసీఎస్‌తో కొలిక్కిరాని సంప్రదింపులు - జాప్యంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

Conveners_Appointment_ISSUE
Conveners_Appointment_ISSUE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2025, 4:47 PM IST

Delay in Appointment of Conveners for Conducting Entrance Exams:రాష్ట్రంలో అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్ల నియామకం, పరీక్షల తేదీలను ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కన్వీనర్లను సకాలంలో నియమిస్తేనే వారు నిపుణుల నుంచి ప్రశ్నలు ఆహ్వానించి, ప్రవేశ పరీక్షలకు ప్రశ్నపత్రాలను రూపొందించేందుకు సమయం దొరుకుతుంది. ఈ దశలో జాప్యం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ఇప్పటికే చాలా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించాయి. జేఈఈ మెయిన్స్‌ మొదటి విడత ఈనెల 22 నుంచి ప్రారంభమవుతుండగా, అడ్వాన్స్‌డ్‌ పరీక్ష మే 18న నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదలైంది. మరోపక్క, తెలంగాణలో పలు సెట్‌లకు కన్వీనర్ల నియామకంతో పాటు షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో టీడీఈఏరీ(TGEAP) సెట్‌ ఏప్రిల్‌ 29 నుంచి ప్రారంభం కానుంది. ఏపీలో ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులు ప్రైవేటు వర్సిటీలతో పాటు తెలంగాణలోనూ రాస్తారు. ఇక్కడ సెట్‌ల షెడ్యూల్‌ విడుదలైతే తదనుగుణంగా వారు ప్రణాళికలు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇంటర్‌ పరీక్షలు మార్చి 1న ప్రారంభమై 20తో పూర్తి కానున్నాయి. ఈ పబ్లిక్‌ పరీక్షలు పూర్తయితే, ఆ తర్వాతి ఉన్నత చదువుల కోసం విద్యార్థులు సన్నద్ధమవుతారు. ఏపీ సెట్‌ల నిర్వహణలో జాప్యం జరిగితే విద్యార్థుల ప్రవేశాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. స్థానికంగా ప్రవేశాలు పొందాలనుకునే వారిపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, పక్క రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షలు తొందరగా పూర్తయితే వాటిల్లో చేరాలా? ఏపీలో జరిగే కౌన్సిలింగ్‌ వరకూ ఎదురుచూడాలన్న సంశయం ఏర్పడుతుంది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రవేశాలు పెంచుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచే ప్రమాదముంది.

'సాక్షి' న్యూస్ సహా పలువురి సోషల్ మీడియా అకౌంట్లపై కేసులు

పరీక్షల నిర్వహణకు ధర పెంచాలని డిమాండ్‌: ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతను టెండర్ల ద్వారా టీసీఎస్ సంస్థకు అప్పగిస్తూ వస్తున్నారు. గతేడాది ఒక్క సంవత్సరానికి టెండరు నిర్వహించారు. ఇప్పుడు ఈ సంస్థ పరీక్షల నిర్వహణకు ధర పెంచాలని డిమాండ్‌ చేస్తోంది. గతంలో దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణ, ర్యాంకు కార్డులు ఇచ్చేవరకు ఒక్కో విద్యార్థికి 350 రూపాయల చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు 450 రూపాయలు ఇస్తేనే చేస్తామని టీసీఎస్ అంటోంది. ఇంతమొత్తం పెంచి టెండరు లేకుండా పనులు అప్పగించడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. స్వల్పకాలిక టెండరుకు వెళ్లాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు టెండర్లు పిలిచినా, ప్రక్రియ పూర్తయ్యే సరికి ఈ నెల గడిచిపోతుంది. తెలంగాణతో పాటు జేఈఈ, కేంద్రంలోని ఇతర ప్రవేశ పరీక్షలను టీసీఎస్ నిర్వహిస్తోంది. వీటి ఆధారంగానే ఏపీ ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ ఇస్తుంది.

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణను ఉన్నత విద్యామండలి పర్యవేక్షిస్తుండగా ప్రభుత్వం ఇటీవలే ఛైర్మన్‌ను నియమించింది. ఇప్పటికే 17 విశ్వవిద్యాలయాల్లో వీసీ పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారు. వీటిని పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు సెర్చ్‌ కమిటీల సమావేశాల నిర్వహణను ఉన్నత విద్యామండలే పర్యవేక్షిస్తోంది. ఒకేసారి అన్ని పనులు రావడంతో మండలిపై ఒత్తిడి పెరిగిపోయింది. ప్రవేశ పరీక్షల నిర్వహణను చూసేందుకు ప్రత్యేక అధికారి లేకుండాపోయారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నియమితులైన సుధీర్‌రెడ్డి సమయం పూర్తికావడంతో దిగిపోయారు.

బాధ్యతల అంశంపై సందిగ్ధం:కార్యదర్శి సైతం వెళ్లిపోవడంతో సంయుక్త కార్యదర్శికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. గత ప్రభుత్వంలో నియమించిన ఇద్దరు వైస్‌ ఛైర్మన్లు ప్రస్తుతం కొనసాగుతున్నారు. వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. గత ప్రభుత్వంలో కొంతమంది డిగ్రీ కళాశాలల లెక్చరర్లను డిప్యూటేషన్, ఆన్‌డ్యూటీపై తీసుకొచ్చి కొన్ని పనులు అప్పగించారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలో పనిచేసి, పదవీ విరమణ చేసిన ఓ అధికారిని తీసుకొచ్చి, నిబంధనలకు విరుద్ధంగా ఎకౌంటింగ్‌ బాధ్యతలు ఇచ్చారు. వీలైనంత త్వరగా ప్రవేశపరీక్షల షెడ్యూలు విడుదలచేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పెట్టుబడుల వేటలో లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు

తిరుమలలోని ఈ పెయింటింగ్ ఏమిటో తెలుసా? - 90శాతం మంది భక్తులు ఫెయిల్!

ABOUT THE AUTHOR

...view details