Dasara Bus Fare Hike in Tealangana : తెలంగాణలో అతి పెద్ద పండుగ అంటే బతుకమ్మ, దసరా అని ఇట్టే చెప్పేస్తారు. నగరాలు, పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు ఈ పండక్కి సొంతూళ్ల బాట పడతారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రజా రవాణా సంస్థ ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తోంది. గతేడాది, అంతకు ముందు సంవత్సరాల్లో దసరా పండక్కి సొంతూళ్లకు సాధారణ ఛార్జీలతోనే వెళ్లి వచ్చిన ప్రజల నుంచి ఆర్టీసీ ఈసారి అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం తర్వాత సంస్థ లాభాల్లోకి వచ్చింది. ఇలాంటి సమయంలో ఆర్టీసీ మెరుగైన సేవలు అందిస్తుంది అనుకున్నారు అంతా. కానీ వారికి ఆ సంస్థ షాక్ ఇచ్చింది.
దసరాకు నడుపుతున్న ప్రత్యేక సర్వీసుల టికెట్ బేసిక్ ధరలో ఆర్టీసీ 50 శాతం పెంచింది. దీంతో ఛార్జీలు భారీగా పెరిగాయి. హైదరాబాద్-ఆదిలాబాద్ సూపర్ లగ్జరీ రెగ్యులర్ బస్‌లో ఛార్జీ రూ.630 ఉండగా, స్పెషల్ బస్సుల్లో రూ.880 అవుతోంది. హైదరాబాద్ నగరంలో నడిపే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులనూ ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో దూర ప్రాంతాలకు నడుపుతోంది. ఈ బస్సులు సిటీల్లో పరిమిత దూరం వరకు సౌకర్యంగా ఉంటాయి, కానీ వందల మీటర్ల దూర ప్రాంతాలకు నడుపుతున్న కారణంగా 50 శాతం అదనపు బాదుడుతో ఆర్టీసీ నడుపుతోంది.