Dasa Avataras Of Lord Shiva :శ్రీమహావిష్ణువు ధరించిన 10 అవతారాల గురించి అందరికీ తెలిసిందే. వాటినే దశావతారాలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ పరమశివుడు కూడా పది అవతారాలు ధరించారని మీరెప్పుడైనా విన్నారా? అయితే ఈ శివదశావతారాల గురించి తెలుసుకోండి. వాటి గురించి ప్రతిరోజూ ఉదయం మననం చేసుకున్న భక్తులకు ఆ పరమశివుడు సకల శుభాలు చేకూరుస్తారని కథనం తెలియజేస్తుంది. ఇది శివమహాపురాణంలో శతరుద్రసంహిత 17వ అధ్యాయంలో ఉన్న విషయం. ఈ కథను విన్నా, చదివినా సకల సుఖాలు లభించి, శుభాలు కలుగుతాయని నమ్మకం.
మహా శివుడి దశావతారాలు ఇవే :
- శివుడి దశావతారాలలో మొదటిది మహాకాళి అవతారం. ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది. మహాకాలుడు భక్తజనులకు భుక్తిని, ముక్తిని కల్పిస్తాడు.
- దశావతారాలలో 2వ అవతారం తార్. ఈ అవతార సమయంలో శక్తి తారా అనే పేరుతో మహశివుడిని అనుసరించి ఉంటుంది. ఇద్దరూ తమ సేవకులకు భుక్తి, ముక్తులను అనుగ్రహిస్తారు.
- శివుడి దశ అవతారాలలో మూడో అవతారం బాలభువనేశుడు. ఈ అవతారంలో పరమశివుడి ఇల్లాలైన పార్వతి బాలభువనేశ్వరి అనే పేరున ఉంటూ భక్తులను రక్షిస్తుంది. అప్పుడా తల్లి తన భక్తులకు సర్వసుఖాలను ప్రసాదిస్తుంటుంది.
- శివుడి నాలుగో అవతారం షోడశశ్రీవిద్యేశుడు. ఈ అవతారంలో పార్వతి షోడశీశ్రీవిద్యాదేవిగా ఉంటుంది. ఈ దేవతల ఆరాధన వల్ల భక్తులకు ముక్తి, భుక్తి, సుఖాలు లభిస్తాయి.
- శివుని ఐదో అవతారం పేరు భైరవుడు. అప్పుడు పార్వతీదేవి భైరవిగా ఉంటూ తన ఉపాసకులను, భక్తులను అన్ని కాలాల్లోనూ అనుగ్రహిస్తుంటుంది.
- మహాశివుడి ఆరో అవతారమే చిన్నమస్తకుడు. అప్పుడు చిన్నమస్తకిగా పార్వతిదేవి అవతరించి భక్తులను అనుగ్రహిస్తుంటుంది. ధూమవంతుడు అనేది శివుని ఏడో అవతారం. ఈ అవతారం అప్పుడు పార్వతి ధూమావతి అనే రూపంలో ఉంటుంది. భక్తుల కొంగుబంగారంగా ఈ అవతారంలో ఆదిదంపతులుంటారు.
- బగలాముఖుడు అనే పేరున్న అవతారం శివుడి 8వ అవతారం. అప్పుడా పరమేశ్వరీ బగలాముఖీ, మహానంద అనే పేర్లతో భక్తులను అనుగ్రహిస్తుంటుంది.
- శివుని తొమ్మిదో అవతారం పేరు మాతంగుడు. ఈ అవతారంలో పార్వతిదేవి మాతంగిగా భక్తులను అనుగ్రహిస్తుంది.
- కమలుడు అనే పేరున్న అవతారం శంభుడి పదో అవతారం. అప్పుడు పార్వతి కమల అనే పేరున ఉండి తన భక్తులను రక్షిస్తూ ఉంటుంది. ఈ పది అవతారాలు తమను ఆరాధించే భక్తులను వెన్నంటి ఉంటూ ఎంతో మేలును చేకూరుస్తుంటాయి.