Bike Racing Stunts in IT Corridor : రాష్ట్రానికే తలమానికమైన ఐటీ కారిడార్ రాత్రిపూట పోకిరీలకు అడ్డాగా మారుతోంది. నగరం నలుమూలల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్ల మీద వచ్చే ఆకతాయిలు టీ హబ్ రోడ్డులో ప్రమాదకర స్టంట్లు, రేసింగ్ నిర్వహిస్తూ హల్చల్ చేస్తున్నారు. వారాంతాలు, పండుగలు, ప్రత్యేక సమయాల్లో ఐటీ హబ్‌కు చేరుకుని నడిరోడ్డుపై బీభత్సం సృష్టిస్తున్నారు. దీనిని పోలీసులు పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
కొందర్ని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నా, బైకులు స్వాధీనం చేసుకుంటున్నా ఎప్పటికప్పుడు మళ్లీ పాత కథే మొదలవుతోంది. పోలీసులు సరైన వ్యూహంతో వ్యవహరించకపోవడం వల్లే పోకిరీలు భారీగా తరలివస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కోసారి ఒకరిద్దరు కానిస్టేబుళ్లను స్టంట్లు జరిగే ప్రాంతాల్లో విధుల్లో ఉంచుతున్నారు. దేశ, విదేశాలకు చెందిన ఐటీ సంస్థలు ఉండే చోట తరచూ ఇలాంటివి జరగడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
టీ హబ్ దగ్గర ఎక్కువే: విశాలమైన రోడ్లు, ఇరువైపులా అద్దాల మేడల్లాంటి భవనాలు, దూసుకెళ్లేందుకు అనువైన దారి, వీరిని అడ్డుకోవడానికి చాలీచాలని పోలీసు సిబ్బంది ఇవే ఐటీ కారిడార్లో పోకిరీలు స్టంట్లు వేసేందుకు కారణమవుతున్నాయి. ఐటీ కారిడార్లో ప్రధానంగా టీ హబ్, అరవింద్ గెలాక్సీ మార్గంలో బైక్ స్టంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. స్టంట్లు వేసేందుకు పదుల సంఖ్యలో ఆకతాయిలు వస్తుంటే వారిని వీక్షించేందుకు నగరం నలుమూలల నుంచి వందలాది మంది యువత ద్విచక్రవాహనాలు, కార్లలో తరలివస్తున్నారు.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్‌లో రీల్స్, షార్ట్స్ కోసం బైకర్లు స్టంట్లు వేస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వస్తున్నా స్టంట్లు జరిగే ప్రాంతానికి చేరుకోనే మార్గాల్లో వారాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆకతాయిలు ఇటువైపు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటే దీనికి కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. దీనికి బదులు మెజార్టీ సందర్భాల్లో వందలాది గుమిగూడి స్టంట్లు మొదలయ్యాకే చేరుకోవడం సమస్యకు దారి తీస్తోంది.