ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయడానికి నిరాకరణ, 6 నెలల్లో పూర్తి చేయండి - శిరోముండనం కేసులలో వైసీపీ నేతలకు షాక్ - andhra pradesh

Dalits Tonsure Cases: పోలీస్ స్టేషన్​లోనే దళిత యువకుడికి శిరోముండనం చేసిన కేసులో వైసీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్ఐఆర్​ను కొట్టేయడానికి హైకోర్టు నిరాకరించింది. అదే విధంగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై నమోదైన శిరోముండనం కేసులో విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలని విశాఖ ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది.

dalits_tonsure_cases_in_andhra_pradesh
dalits_tonsure_cases_in_andhra_pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 1:30 PM IST

Dalits Tonsure Cases: దళిత యువకుడి పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన అధికార పార్టీ నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పోలీస్ స్టేషన్​లోనే శిరోముండనం చేయించినందుకు వైసీపీ నేతలపై నమోదైన కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆరుగురు నిందితులు దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది.

కేసు దర్యాప్తు దశలో ఎఫ్ఐఆర్​ను కొట్టేయడం కుదరదని స్పష్టంచేసింది. అందుకు బలం చేకూర్చేలా సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పులు ఇచ్చిందని గుర్తుచేసింది. పిటిషనర్లపై తదుపరి చర్యలొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈమేరకు కీలక తీర్పు ఇచ్చారు.

2020 జులై 20న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్​లో దళిత యువకుడు వరప్రసాద్​కు శిరోముండనం చేసిన ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇసుక మాఫియాను ఎదురించినందుకు వైసీపీ నేత కవల కృష్ణమూర్తి, ఆయన అనుచరులు ఈ దురాగతానికి కారణం అని బాధితుడు ఆరోపించారు.

ఆయన ఫిర్యాదు మేరకు సీతానగరం పోలీసులు వైసీపీ నేత కృష్ణమూర్తితో పాటు ఆయన అనుచరులు కె.వెంకట నాగదుర్గ శివప్రసాద్, కె. వీరబాబు, కె.నాగేంద్రబాబు, ఎ. పుష్కరం, ఎ. భూషణం, ఎస్సై తదితరులపై కేసు నమోదు చేశారు. తమపై కేసును కొట్టేయాలని కోరుతూ కృష్ణమూర్తితో పాటు ఆయన అనుచరులు హైకోర్టును ఆశ్రయించారు.

2020 సెప్టెంబర్ 4న హైకోర్టు విచారణ జరిపింది. వారిపై తదుపరి చర్యలన్నింటిని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వుల్చింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై హైకోర్టు తుది విచారణ జరిపింది. బాధితుడి తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారనే కారణంతో వరప్రసాద్​ను కులం పేరుతో దూషించి అత్యంత దారుణంగా కొట్టారన్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో పోలీస్ స్టేషన్​లోనే శిరోముండనం చేశారన్నారు. నిందితులు దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టేయాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేసిన న్యాయమూర్తి, పిటిషన్ను కొట్టేస్తూ గురువారం నిర్ణయాన్ని వెల్లడించారు.

సీతానగరం శిరోముండనం కేసు - నిందితుల క్వాష్‌ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

ఆరు నెలల్లో విచారణను పూర్తి చేయాలి: సంచలనం సృష్టించిన దళితులకు శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మరికొందరిపై 1997వ సంవత్సరంలో నమోదైన కేసును సాధ్యమైనంత త్వరగా, గరిష్ఠంగా ఆరు నెలల్లో విచారణను పూర్తి చేయాలని విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు(11వ ఏడీజే కోర్టు)ను హైకోర్టు ఆదేశించింది.

బాధితులు సమర్పించే కులధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, వారి సాక్ష్యం నమోదుకు ప్రత్యేక కోర్టు నిరాకరించడం సీఆర్‌పీసీ సెక్షన్‌ 311, ఎస్సీ, ఎస్టీ చట్టం ఉద్దేశానికి విరుద్ధం అని స్పష్టం చేసింది. బాధితుల కుల ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకునేందుకు నిరాకరిస్తూ 2021 సెప్టెంబరు 7వ తేదీన ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఈ కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణను ప్రారంభించింది. బాధితులు/ఫిర్యాదుదారులు కోటి చిన్నరాజు, డి.వెంకటరత్నంల సాక్ష్యాల నమోదుకు ఈ నెల 5కు వాయిదా వేసింది.

మూత్రం పోసి, గుండు కొట్టిన ఘటనలో నిందితులకు ఓ కానిస్టేబుల్ సహకారం..?

ABOUT THE AUTHOR

...view details