Cyclone Remal Effect on AP: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను ఉద్ధృతమై తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఈ తుపాను బంగ్లాదేశ్ కేపుపారాకు దక్షిణ నైరుతి దిశగా 260 కిలోమీటర్ల దూరంలో వెస్ట్ బంగాల్ సాగర్ ఐలాండ్స్కు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడుతుంది. ఈరోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపుపారా – వెస్ట్ బంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య రెమాల్ తుపాను తీరం దాటనుంది.
తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. అత్యధికంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో 80 కిలోమీటర్లు వేగంతో, ఉత్తర బంగాళాఖాతంలో 80 నుంచి 85 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు ఉంటాయి.
దూసుకొస్తున్న 'రేమాల్' తుపాను - ఏయే రాష్ట్రాలపై ప్రభావం ఉందంటే - Cyclone Remal Effect on AP
తుపాను ప్రభావం పశ్చిమ బంగాల్, ఒడిశా మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో మే 27వ తేదీ వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు సూచనలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో ఒడిశా, బంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో మంగళవారం వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో తుపాను నేపథ్యంలో పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.