Cyber Fraud by Fake Whatsapp Wedding Invitation :ఒకప్పుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉంటే ఎంత దూరమైనా బంధువుల ఇంటికెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. డిజిటల్ పత్రికలు, వీడియోలు, వేడుక జరిగే లొకేషన్ మ్యాప్స్ లింక్ ఇలా వాట్సప్‌లో పంపించి ఆహ్వానిస్తున్నారు. ఈ టెక్నాలజీనే సైబర్ నేరస్థులు సైతం తమ అస్త్రంగా మలుచుకుంటున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక పేరుతో ఫోన్‌కు సందేశాలు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (ఏపీకే) ఫైళ్లు పంపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వీటితో బాధితుల నుంచి డబ్బు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో మోసానికి పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. కొత్త ఫోన్ నంబర్ల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, లింకులు క్లిక్ చేయొద్దని, వాటిని డౌన్లోడ్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
ఆసక్తితో తెరిస్తే ఇక అంతే :గుర్తుతెలియని నంబర్లు, ఖాతాల నుంచి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్ తదితరాలకు ఆహ్వాన పత్రికలు, వీడియోలు, లింకులు, డాక్యుమెంట్లు, ఫైళ్లను సైబర్ నేరస్థులు పంపిస్తారు. దీంతో ఎవరు పంపారనే ఆసక్తితో క్లిక్ చేస్తే మన ప్రమేయం లేకుండా ఫోన్లోకి ఏపీకే ఫైల్ రూపంలో ఉండే యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఫోన్ గ్యాలరీ, యాప్‌లలోని డేటాతో సహా అన్ని రకాల అనుమతుల్ని ఈ మాల్వేర్ సొంతంగా దానంతట అదే తీసుకుంటుంది. ఇలా డిజిటల్ వెడ్డింగ్ ఇన్విటేషన్, వీడియోలు అని భావించి డౌన్లోడ్ చేస్తే ప్రమాదకర సాఫ్ట్వేర్ యాప్‌లు ఇన్స్టాల్ అయి ఫోన్ హ్యాక్ అవుతుంది.
దీంతో సైబర్ నేరగాళ్లు పూర్తిగా మొబైల్ ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును కాజేస్తారు. ఫోన్, కంప్యూటర్లోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బెదిరింపులకు పాల్పడే ప్రమాదముంటుంది. ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో ఇలాంటి తరహా ఫిర్యాదులు అందకున్నా సైబర్ నేరగాళ్లు వెడ్డింగ్ ఇన్విటేషన్, వీడియోలు, లింకులు, ఫైళ్లు పంపుతూ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.