Cyber Crimes in Hyderabad : సైబర్ కేటుగాళ్లు ఏ అవకాశాన్ని వదలుకోవట్లేదు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ప్రతి అంశాన్ని వాడుకుని సొమ్ము చేసుకుంటున్నారు. పేద పిల్లలకు విద్య, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ప్రార్థనామందిరాలకు పెద్ద మొత్తంలో విరాళాలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత వైద్యం చేస్తామంటూ సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ఆకట్టుకుంటున్నారు. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన ఉన్నవారు నిజమని నమ్మి స్పందించి డబ్బులు పంపి నష్టపోతున్నారు.
నమ్మకం కలిగేలా : విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, ట్రస్ట్‌లు, స్వచ్ఛంద సంస్థలు భారత్‌లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయంటూ ఫోన్ నంబర్లకు మెసేజ్‌లు, లింక్‌లు పంపుతున్నారు. వాటిని చూసి స్పందించిన వారి ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాల లావాదేవీలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. మొదటగా నమ్మకం కలిగించడానికి రూ.5 నుంచి 10 వేలు బాధితుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
1930 టోల్‌ఫ్రీ నంబరు : పెద్దమొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ముందుగా ట్యాక్స్ చెల్లించాలంటూ రూ.లక్షలు కొట్టేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు 5 నుంచి 6 కేసులు నమోదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల పేరిట వచ్చే లింక్‌లు, సేవ, విరాళాల పేరిట వచ్చే ప్రకటనలు నమ్మవద్దని సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు నష్టపోయిన బాధితులు టోల్‌ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.