తెలంగాణ

telangana

ETV Bharat / state

సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఆ పత్రాలు అడిగితే ఇచ్చేస్తున్నారా? - అయ్యో.. అలా ఇవ్వకూడదండి - CYBER ​ALERT ON FAMILY SURVEY

సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్‌ నేరగాళ్ల కన్ను - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన

Cyber ​​Criminals On Comprehensive Family Survey
Cyber ​Alert On Family Survey (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2024, 10:10 AM IST

Updated : Nov 9, 2024, 6:56 AM IST

Cyber ​​Alert On Comprehensive Family Survey :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేపై సైబర్‌ నేరగాళ్ల కన్ను పడింది. ఆన్‌లైన్‌లో సర్వే, డిజిటల్‌గా కొన్ని పత్రాలు పంపాలంటూ నేరస్థులు మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వేలో భాగంగా కాల్‌ చేశామని, అడిగిన పత్రాలు ఇవ్వాలంటూ కాల్స్‌ వస్తున్నట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

లింకులు, ఏపీకే ఫైల్స్‌తో గాలం :
సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఇటీవల మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులకు పరిహారం పేరుతో మోసగించేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్‌లోని కొందరికి ఏపీకే ఫైళ్లు పంపించారు. నేరగాళ్లు ఇప్పుడు కుటుంబ సర్వేను అస్త్రంగా మార్చుకున్నారు. ఈ తరహా మోసాలపై ఇప్పటివరకూ కేసులు నమోదవ్వకున్నా సర్వే పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్, సందేశాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని పోలీసులు ప్రచారం చేస్తున్నారు. కుటుంబ సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బంది నేరుగా ఇళ్లకు వచ్చి మాత్రమే వివరాలు నమోదు చేసుకుంటారు. ఎలాంటి పత్రాలు తీసుకోరు. పని ఒత్తిడి, వ్యాపారంతో తీరిక లేకుండా ఉండడం, ఇతర ప్రాంతాల్లో పర్యటనల దృష్ట్యా సర్వే ఎప్పుడు పూర్తవుతుందోనని కొందరు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారినే సైబర్‌ ముఠాలు లక్ష్యంగా చేసుకునే అవకాశముంది.

ఒక వేళ సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేస్తే : నేరగాళ్లు కుటుంబ సర్వేలో భాగంగా కాల్‌ చేస్తున్నామని.. ఆధార్, పాన్‌ తదితర గుర్తింపు పత్రాలు పంపాలని లేకపోతే తాము పంపించే లింకును క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని నమ్మిస్తారని పోలీసులు చెబుతున్నారు. వాట్సాప్‌కు వెబ్‌లింకులు, ఏపీకే(ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ) ఫైల్‌ పంపిస్తారని.. గూగుల్‌ ప్లేస్టోర్, ఐస్టోర్‌లో లేని యాప్‌లనే ఏపీకే ఫైళ్ల ద్వారా పంపిస్తారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ నిజమేనని నమ్మి వీటిని క్లిక్‌ చేస్తే ప్రమాదకర యాప్‌లు డౌన్‌లోడ్‌ అవుతాయని తెలిపారు. తద్వారా ఫోన్‌ పూర్తిగా నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లి ఫొటోలు, బ్యాంకు ఖాతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లి మనకు వచ్చే కాల్స్‌ను కూడా నేరస్థులు వినొచ్చన్నారు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు కొట్టేయడం, వ్యక్తిగత ఫోటోలతో బెదిరింపులకు దిగడం వంటివి జరుగుతాయన్నారు. ఒక వేళ సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేసినా.. మోసపోయినా వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదుచేయాలని సూచిస్తున్నారు.

NOTE : సిబ్బంది ఎలాంటి పత్రాలు తీసుకోరు

⊛ సర్వే సిబ్బంది నేరుగా ఇళ్లకే వచ్చి సమగ్ర వివరాలు నమోదు చేసుకుంటారు.

⊛ ఆధార్, రేషన్, పాన్‌ కార్డులతో సహా ఎలాంటి ధ్రువీకరణ డాక్యుమెంట్లనూ తీసుకోరు.

⊛ ఫొటోలు అడగరు.. కెమెరాతో ఎటువంటి సమాచారాన్ని చిత్రీకరించరు.

⊛ ఆధార్‌ అనుసంధానం అంటూ మెషిన్లు తీసుకొచ్చి వేలిముద్రలు సేకరిస్తామంటే అసలు నమ్మొద్దు.

⊛ ఎవరైనా ఫోన్‌ చేసి ఆయా వివరాలు అడిగితే మోసమని అలర్ట్ అవ్వాల్సిందే.

⊛ సర్వే పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేసినా, మోసపోయినా వెంటనే ‘1930’ టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించి కంప్లైంట్ చేయాలి.

ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే - పట్నంలో ఉండే పల్లెవాసులు ఇలా చేయాల్సిందే!

సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం - 75 ప్రశ్నలతో క్వశ్చన్ పేపర్ రెడీ

Last Updated : Nov 9, 2024, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details