Fake CBI Call Frauds In Hyderabad : ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల నుంచి సొమ్ము దోచేందుకు నయా మార్గాలను అనుసరిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను ఉపయోగించుకుని బెదిరింపులకు పాల్పడి డబ్బులు దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హైదరాబాద్ నగరంలో జరిగింది.
సీబీఐ పోలీసులమని చెప్పి :నగరానికి చెందిన ఓ మహిళకు మంగళవారం రోజున సైబర్ నేరస్థుల నుంచి వీడియో కాల్ వచ్చింది. తెలిసినవారనుకొని ఆమె కాల్ లిఫ్ట్ చేసింది. అంతే క్షణాల్లోనే ఎదురుగా పోలీసులు ప్రత్యక్షమయ్యారు.దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తాము సీబీఐ పోలీసులమని అవతలి వ్యక్తులు పరిచయం చేసుకున్నారు. మీ భర్త, కుమారుడిని డ్రగ్, మనీలాండరింగ్ కేసులో ‘నాన్-బెయిల్ వారెంట్’పై అరెస్టు చేశామని ఆమెకు తెలిపారు. వారిని కేసు నుంచి తప్పించాలన్నా ఇంటికి పంపాలన్నా వెంటనే రూ.50 వేలు తాము చెప్పిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని హుకుం జారీ చేశారు.
గృహిణికి భర్త ఏడుపు వినిపించి :పోలీసు సిబ్బంది వారిపై లాఠీలతో దాడి చేస్తున్నారు. ఎలా ఏడుస్తున్నారో వినండి అంటూ బాధితురాలికి ఏడ్పులు వినిపించారు. దాంతో ఆమె నిజమేననుకొని భయపడి వణికిపోయింది. తమ వారిని సంప్రదిస్తానని ఆమె చెబితే 'వీడియోకాల్ కట్ చేసినట్లయితే మీ వాళ్లు ఇంటికి కాదు నేరుగా జైలుకెళ్తారని' కేటుగాళ్లు బెదిరించారు. డబ్బుల కోసం తొందరపెడుతూ ఆ మహిళను మానసికంగా వేధించారు.