Cyber Crime DCP Kavitha About Online Scams :పక్కింటి అబ్బాయిని చూడు. చదువు అయిపోయింది. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఫలానా వాళ్ల అమ్మాయిని చూడు ఇన్ని లక్షల జీతం. సాధారణంగా ప్రతి ఊరిలోనూ ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల నుంచి అందిరికీ ఎదురయ్యే అనుభవం ఇది. కానీ సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఉన్న ఆ గ్రామం మాత్రం ఇందుకు భిన్నం. గ్రామంలో అధిక శాతం మంది వారి పిల్లలను ట్రేడింగ్ చేయమని, డబ్బులు సంపాదించమని ఒత్తిడి చేస్తున్నారు. ఓ కేసు దర్యాప్తులో ఆ గ్రామానికి వెళ్లిన పోలీసులు, అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్యపోయారు.
సైబర్ మోసగాళ్లకు ఏజెంట్లుగా :హైదరాబాద్లో నమోదవుతున్న ట్రేడింగ్ మోసాల కేసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సైబర్ మోసాల దర్యాప్తులో భాగంగా బ్యాంకు లింకులను పరిశీలిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ నుంచి అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నట్టు గుర్తించారు. సూర్యాపేట జిల్లా కోదాడ చుట్టుపక్కల కొన్ని గ్రామాల్లో పెద్దఎత్తున యువతీయువకులు సైబర్ మోసగాళ్లకు ఏజెంట్లుగా మారినట్టు నిర్ధారించారు.
సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో 2 గ్రామాలు :కొంతమంది యువత బ్యాంకు ఖాతాలను సైబర్ కేటుగాళ్లు ఉపయోగించుకుంటున్నట్లుగా సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. వీరి ద్వారానే ఖాతాల్లోకి చేరిన సొమ్మును క్రిప్టోగా మార్చి తాము సూచించిన విదేశీ ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తుండటంతో ఇతరుల పేర్లతో అదనంగా మరికొన్ని బ్యాంకు ఖాతాలు ప్రారంభించి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 2-3 గ్రామాలు మాయగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్టు గుర్తించారు పోలీసులు. గుర్తించిన ఇద్దరు నిందితులకు నోటీసులిచ్చారు.