Construct New Diaphragm Wall for Polavaram : పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రం వాల్‌కు మరమ్మతులా లేక కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు.
కొత్త డయాఫ్రం వాల్ ఏ ప్రదేశంలో నిర్మిస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌కు ఎంత దూరంలో కట్టాలి? ఎలా నిర్మించాలన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని విదేశీ నిపుణులను కేంద్ర జలసంఘం ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రా కోరారు. నాలుగు రోజులుగా పోలవరం ప్రాజెక్టులో పర్యటించిన విదేశీ నిపుణులు ఇక్కడి సాంకేతిక సవాళ్లు, సమస్యలపై అధ్యయనం చేసిన విషయం తెలిసిందే. నిపుణులు గమనించిన అంశాలపై వారితో చర్చించేందుకు బుధవారం నాడు దిల్లీ నుంచి కుష్విందర్ ఓహ్రా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Global Experts Team on Polavaram Diaphragm Wall :ఈ సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్ పాల్, సీస్ హించ్ బెర్గర్, రిచర్డ్ డొన్నెల్లీ, గియాస్ ఫ్రాంక్ డి సిస్కో, రాష్ట్ర ప్రభుత్వ జలవనరులశాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం ఇంఛార్జ్ చీఫ్ ఇంజినీర్ నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి రఘురామ్, కేంద్ర జలసంఘం డిజైన్ల విభాగం చీఫ్ ఇంజినీర్ విజయ్ శరణ్, డిప్యూటీ డైరెక్టర్లు అశ్వనీకుమార్, గౌరవ్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
నిపుణుల నివేదిక ఆధారంగానే :ఇప్పటికే కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజినీర్, విదేశీ నిపుణులు ఛైర్మన్ ఓహ్రాకు ఒక నివేదిక పంపారు. నాలుగు రోజులుగా ఏమేం పరిశీలించారు, ఏమేం చర్చలు జరిగాయి, వాటి సారాంశం ఏంటనే అంశాలను అందులో నివేదించారు. ఆ నివేదిక ఆధారంగానే కుష్విందర్ ఓహ్రా భేటీ నిర్వహించారు. విదేశీ నిపుణులు నలుగురు తమ అభిప్రాయాలు ఆయనకు తెలియజేశారు. కేవలం ఇక్కడ చూసిన అంశాలు, ఇక్కడి వారి అభిప్రాయాలు, చర్చల ఆధారంగా మాత్రమే తుది నిర్ణయాలకు రాలేమని వారు పేర్కొన్నారు. ఉన్న నివేదికలను అధ్యయనం చేసేందుకు తగినంత సమయం దొరకలేదని, వాటన్నింటినీ అధ్యయనం చేసి రెండు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇస్తామని ఓహ్రాకు విదేశీ నిపుణులు వివరించారు.
ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక రచించుకోవాలని ఛైర్మన్ కుష్విందర్ ఓహ్రా వెల్లడించారు. ఆ నివేదికలను ఆధారంగా తీసుకుని ఇప్పటికే అంతర్జాతీయ డిజైన్ నిపుణులు ఆఫ్రి పోలవరంలో పని చేస్తున్నారు. వారు డిజైన్లు రూపొందిస్తారు. వాటిని విదేశీ నిపుణులకు పంపి, ఆమోదం తీసుకోవాలి. ఆ తర్వాత కేంద్ర జలసంఘానికి సమర్పించి, డిజైన్లకు ఆమోదం తీసుకుని పనులు ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.