Crops Loss Due to Floods in Guntur District : గుంటూరు జిల్లాలో పది రోజుల క్రితం వరకూ పంట పొలాలు పచ్చని పైర్లతో కళకళలాడాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు చాలా కాలం తర్వాత జలకళను సంతరించుకోవడంతో వరి, పత్తి, మినుము, ఇతర ఉద్యాన పంటల దిగుబడిపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఐతే కృష్ణమ్మ ఉగ్రరూపంతో పంటల్ని ముంచెత్తడం అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. రైతుల కష్టాల్ని వరదపాలు చేసింది.
గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గంలోనే అత్యధికంగా వరద నష్టం జరిగింది. ఇక్కడ మూడు మండలాల్లో కలిపి 17 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నట్లు రైతులు చెప్తున్నారు. పెదకాకాని మండలంలోనే 7 వేల ఎకరాల వరి నీట మునిగింది. పెదకాకాని, వెంకటకృష్ణాపురం, దేవరాయబొట్లపాలెంలో వేల ఎకరాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. చేబ్రోలు మండలంలో 6500 ఎకరాల్లో వరి, 680 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పొన్నూరు మండలంలో 4 వేల ఎకరాల వరికి నష్టం వాటిల్లింది.
'నష్టపోయిన వారంతా సన్నకారు రైతులే, 85 శాతం కౌలు రైతులూ ఉన్నారు. ఇప్పటికే ఎకారానికి రూ. 35 వేల దాక కౌలు కట్టాము, పంటకు రూ. 15 వేల నుంచి రూ. 20వేల దాకా ఖర్చులు అయ్యాయి. ఒక్క ఎకరం కూడా రికవర్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఏ రైతును కదిలించినా కష్టాలే ఉన్నాయి. మా వరి మాగాణి నంబూరు నుంచి వచ్చే మురుగు కాలువ వల్ల మునిగింది. చేనులో అయిదు అడుగుల మేర నీరు చేరింది, ఇప్పటికీ అలాగే ఉంది. వ్యవసాయమే మా జీవనాధారం. ఇప్పుడు మేము ఏమీ చెయ్యలేని పరిస్థుతుల్లో ఉన్నాము.' - బాధిత రైతులు