CRDA Plans to Start Works in Capital Amaravati:రాజధాని అమరావతిలో పనులు ప్రారంభించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు 15వ తేదీ నుంచి పనుల్ని పునఃప్రాంభించేందుకు వీలుగా ప్రణాళికను రూపొందించారు. నిర్మాణ పనులకు సంబంధించి పాత టెండర్లను రద్దు చేసేందుకు తీర్మానం చేసిన మంత్రి మండలి కొత్త టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు కూడా అనుమతి మంజూరు చేసింది. దీంతో పనుల్ని మొదలు పెట్టాలని సీఆర్డీఏ నిర్ణయించింది.
ప్రభుత్వ భవనాల పనులు, ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేటు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఎప్పటిలోగా పూర్తి చేయాలన్న దానిపై సీఆర్డీఏ ప్రణాళికలు చేసింది.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారులకు చెందిన భవనాలు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. వీటిని డిసెంబరు 15 నాటికి ప్రారంభించి 6 నెలల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. గ్రూప్, డీ, బీ, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, మంత్రులు, జడ్జిలకు చెందిన బంగ్లాలను కూడా డిసెంబరు 15 నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు. వీటిని మొత్తం 9 నెలల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్దేశించింది. అలాగే ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి జోన్ 1 నుంచి జోన్ 6 వరకు డిసెంబరు 15 నుంచి అలాగే జోన్ 7 నుంచి జోన్ 12ఏ వరకూ డిసెంబరు 20వ తేదీ నుంచి పనులు చేపట్టనున్నారు. ఈ పనులన్నీ 24 నెలల్లోగా పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్దేశించింది.
"ఏపీలో మెగాసిటీ నిర్మాణం" - స్థిరాస్తి లేఔట్ అనుమతుల్లో సడలింపులు : మంత్రి నారాయణ