Amaravati Construction Works Updates :రాజధాని అమరావతిలో మరో రూ. 24,276.83 కోట్ల పనులు చేపట్టేందుకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోద ముద్ర వేసింది. రాజధానిలో ప్రధాన రహదారులు, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన అన్నదాతలకు స్థలాలు కేటాయించిన ఎల్‌పీఎస్ లేఅవుట్‌లలో మౌలిక సదుపాయాల కల్పన, అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, విభాగాధిపతుల కార్యాలయ భవనాల (టవర్ల) నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలకు సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం ఆమోదించింది.
దీనితో కలిపి ఇప్పటివరకు రూ. 45,249.24 కోట్ల పనులకు ఆమోదం లభించింది. అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పి.నారాయణ వెల్లడించారు. ఈ నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ భవనాలను నిర్మించడానికి మొత్తం రూ. 62,000 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. మిగతా పనులకు వీలైనంత త్వరలో అనుమతులు తీసుకుంటామని చెప్పారు. టెండర్ల ప్రక్రియ మూడు రోజుల్లో ప్రారంభం కానుందని నారాయణ తెలియజేశారు.
103 ఎకరాల్లో అసెంబ్లీ భవనం - ప్రజలు టవర్ పైకి ఎక్కి నగరాన్ని చూడొచ్చు :
- అసెంబ్లీ భవనం నిర్మించే స్థలం విస్తీర్ణం : 103 ఎకరాలు
- నిర్మిత ప్రాంతం : 11.22 లక్షల చదరపు అడుగులు
- భవనం టవర్ ఎత్తు : 250 మీటర్లు
- అంతర్గత, మౌలిక వసతులు కాకుండా ఖర్చు : రూ.765 కోట్లు
- సంవత్సరంలో 40-50 రోజులే శాసనసభ సమావేశాలు జరుగుతాయి. మిగతా రోజుల్లో సామాన్య ప్రజలు అసెంబ్లీ భవనం టవర్ పైకి ఎక్కి అమరావతి నగరం మొత్తం చూసే అవకాశం కల్పిస్తారు.
42 ఎకరాల్లో - 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు భవనం :
- హైకోర్టు నిర్మించే స్థలం విస్తీర్ణం : 42 ఎకరాలు
- నిర్మిత ప్రాంతం : 20.32 లక్షల చదరపు అడుగులు
- భవనం ఎత్తు : 55 మీటర్లు (బేస్‌మెంట్, గ్రౌండ్ ప్లస్ ఏడు అంతస్తులు)
- అంతర్గత మౌలిక వసతులు కాకుండా ఖర్చు : రూ.1048 కోట్లు
47 అంతస్తులతో సీఎం కార్యాలయ భవనం టవర్ :సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని ఐదు ఐకానిక్ టవర్లుగా నిర్మిస్తారు.
- ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలనశాఖ వంటివి ఉండే టవర్ ఎత్తు : బేస్‌మెంట్+గ్రౌండ్+47 అంతస్తులు, దానిపైన టెర్రాస్ ఉంటుంది.
- నిర్మిత ప్రాంతం : 17,03,433 చదరపు అడుగులు
- మొత్తం అన్ని టవర్లలో నిర్మిత ప్రాంతం : 68,88,064 చదరపు అడుగులు
- మొత్తం వ్యయం : రూ.4688 కోట్లు