Court Sentences Five To Life Imprisonment in 2022 Murder Case :అనంతపురం జిల్లా నార్పలలో 2022 ఏప్రిల్‌లో జరిగిన మట్టి పవన్ కుమార్ హత్యకేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. నార్పలకు చెందిన పవన్ కుమార్ కు అతడి స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ తీవ్రం కావడంతో డిపో షాజిద్, చింతాకు రమేష్, చిక్కేపల్లి నాగేంద్ర, తలారి సుధాకర్, తలారి అరుణ్‌లు హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పవన్ ను హత్యచేసి వీడియో తీశారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. విచారించిన కోర్టు ముద్దాయిలకు జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
అక్కడికి పిలిపించి హత్య : పూర్తి వివరాల్లోకి వెళ్తే, మృతుడు పవన్ కుమార్ కుటుంబం అనంతపురంలో ఉంటోంది. 2022 ఏప్రిల్‌లో పవన్ కుమార్ తన తండ్రితో కలిసి నార్పలకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఎదురుపడిన తన స్నేహితులతో గొడవ చోటుచోసుకోవడంతో అది హత్యచేసే వరకు దారి తీసింది. గొడవపడిన రోజు రాత్రే పవన్ కుమార్‌ను స్నేహితులు డిపో షాజిద్, చింతాకు రమేష్, చిక్కేపల్లి నాగేంద్ర, తలారి సుధాకర్, తలారి అరుణ్‌లు నార్పల తహసీల్దార్ కార్యాలయం వెనుకవైపునకు పిలిపించి హత్యచేశారు.
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ : హత్యచేస్తున్న దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడమే కాకుండా, తమను చూసి అందరూ భయపడాలంటూ మాట్లాడిన ఆడియో వైరల్ అయింది. హత్య జరిగిన రోజు నార్పల పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా నిందితులను విచారించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.