Corrupt Officer Veerabhadram in AP Mines Department:వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఓఎస్డీగా వీరభద్రరావు పని చేశారు. మంత్రి చేసిన మైనింగ్ అక్రమాలు, లీజుదారులపై వేధింపులు ఇలా అన్నింటికీ వెన్నుండి సూచనలు, సలహాలు ఇచ్చింది వీరభద్రరావే అని ఆరోపణలున్నాయి. అయితే ఆయనపై ఈగ వాలనివ్వకుండా కూటమి ప్రభుత్వం పంపేస్తుండటాన్ని చూసి గనుల శాఖలో అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం మారడంతో ఆయనకు తగిన గుణపాఠం జరుగుతుందని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండానే బుధవారం దర్జాగా ఆయన పదవీ విరమణ చేయనుండడం చర్చనీయాంశమైంది.
ఓఎస్డీ కనుసన్నల్లోనే అంతా :తనిఖీల పేరిట లీజుదారులను వేధించడం భారీ జరిమానాలతో ఒత్తిళ్లు, బలవంతంగా లీజులు లాక్కోవడం, ఈ-వేలం ద్వారా లీజుల కేటాయింపునకు ముందే వైఎస్సార్సీపీ నేతలకు పాత విధానంలో లీజులు మంజూరు చేయడం, ఇసుక, క్వార్జ్ట్, సిలికాశాండ్ టెండర్లలో దోపిడీలు ఇలా ఒకటేమిటి గత ఐదేళ్లలో గనులశాఖలో జరిగిన ప్రతి దోపిడీకి ప్రత్యక్ష సాక్షిగా ఓఎస్డీ వీరభద్రరావు ఉన్నారని ఆ శాఖలో చెబుతుంటారు. శశికాంత్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రైవేటు పీఏగా ఉండి ఓఎస్డీతో కలిసి సాగించిన దందాలు అన్నీ ఇన్నీ కావు. వీరు చెప్పినట్లే అన్ని దస్త్రాలపై పెద్దిరెడ్డి సంతకాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. లీజుల మంజూరుకు కూడా ఓఎస్డీ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు లేకపోలేదు.
ఆయనను కలిస్తేనే ఉపశమనం :లీజుదారులకు భారీగా జరిమానాలు విధించిన సందర్భాల్లో వారు ప్రభుత్వం ముందు రివిజన్ కోరితే మంత్రి విచారించి నిర్ణయం తీసుకోవచ్చు. ఇటువంటి వందల కేసుల్లో వీరభద్రరావు బేరసారాలు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంత్రి తరఫున ఆయనే సెటిల్‌మెంట్లు చేశారు. మంత్రితోపాటు, ఓఎస్డీకి కూడా వాటా ఇస్తే రివిజన్‌లో భారీ జరిమానాలు కొట్టిపారేసేలా చేసేవారని తెలిసింది. కొన్ని కేసుల్లో భారీ జరిమానాలను నామమాత్రంగా మార్చేశారని సమాచారం.