Rain Alert in AP:పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వద్దే ఉండటం వల్ల ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలిపింది. మరో రెండు రోజులపాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడింది. తర్వాత వాయుగుండంగా బలపడి, తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులు భావించారు. తర్వాత రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. మరో రెండు రోజులకు వాయుగుండంగా మారింది. శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.