Congress State President Sharmila Comments On YS Jagan : వైఎస్సార్సీపీ విశ్వసనీయత కోల్పోయిందని ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరూ మిగలరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్ మంచి పేరు సాధిస్తే కేవలం ఒక్కసారి సీఎం అయిన జగన్ చెడ్డపేరు సాధించారని తెలిపారు. వైఎస్సార్‌కి జగన్‌కు పొంతనే లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ పాటుపడితే జగన్ రిషికొండ పేరుతో కబ్జాలు చేశాడని ఆరోపించారు. బాత్ రూంకు సముద్రపు వ్యూ కావాలని రిషికొండపై భవనాలు కట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ముంబయి నటిని పోలీసు అధికారులు జగన్ ప్రభుత్వంలో ఎంత వేదించారో అందరికీ తెలుసన్నారు.
ఇక అంతం అయినట్లే : వైఎస్సార్సీపీ పార్టీ ఇక అంతం అయినట్లేనని షర్మిల అన్నారు. చివరికి వైఎస్సార్సీపీ చుట్టూ ఉన్న సాయి రెడ్డి, సజ్జల కూడా పార్టీలో ఉండరన్నారు. తిరుపతి లడ్డూ నాణ్యతపై సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇది కోట్ల మంది నమ్మకానికి సంబంధించిన అంశమన్నారు. జులై 12 న తిరుపతి లడ్డూ శాంపిల్స్ తీశారని ఆమె గుర్తుచేశారు. అదే రోజూ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. ఆ రోజు తీసుకున్న శాంపిల్స్ గత ప్రభుత్వం ఇచ్చిన నెయ్యి కాంట్రాక్టర్వేనని స్పష్టం చేశారు. ఆ శాంపిల్స్‌లో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కంటెంట్స్ ఉన్నాయని రిపోర్ట్‌లో తేలిందన్నారు.