Conflict Between Sports Associations in AP :విస్తరిలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు తయారైంది మన క్రీడాకారుల పరిస్థితి. ఆడాలనే ఆశ, గెలిచి పతకాలు కొట్టగలిగే ప్రతిభ ఉన్నప్పటికీ మన ఆటగాళ్లకి జాతీయ క్రీడల్లో పాల్గొనడమే పెద్ద పరీక్షలా మారింది. రాష్ట్రంలోని క్రీడా సంఘాల మధ్య గొడవలతో నలిగిపోతున్నారు. జాతీయ క్రీడల్లో వేర్వేరు సంఘాల తరఫు నుంచి పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్‌లో జరగబోయే పోటీలకు వేర్వేరుగా వెళ్లనున్నారు.
రెండేళ్ల క్రితం గోవాలో నిర్వహించిన జాతీయక్రీడల్లో కర్ణాటక 101 పతకాలు సాధించి ఆరోస్థానంలో నిలిచింది. తమిళనాడు 77 పతకాలతో పదోస్థానాన్ని సాధించింది. మన రాష్ట్రం 27 పతకాలతో 19వ స్థానానికి పరిమితమైంది. ప్రతిభగల క్రీడాకారులకు, పతకాలు సాధించాలనే తపన కలిగిన యువతకు రాష్ట్రంలో కొదవలేదు. అయినా ఎందుకిలా వెనుకబడుతున్నాం? క్రీడా సంఘాల మధ్య వివాదాలు, రాజకీయాలు క్రీడాకారుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సంఘాల్లో గొడవల కారణంగా జాతీయ క్రీడల్లో పాల్గొనడమే క్రీడాకారులకు పెద్ద సవాలుగా మారుతోంది.
70 ఏళ్ల వయసు - సైకిల్‌పై రాష్ట్రాన్ని చుట్టేస్తున్నాడు!
జాతీయ క్రీడల్లో ఏ రాష్ట్రం నుంచి అయినా ఒకే ఒలింపిక్ సంఘం తరఫున ఆటగాళ్లు పాల్గొనడం సహజం. మన దగ్గర ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. ఈ నెల 28న ఉత్తరాఖండ్‌లో ప్రారంభమయ్యే 38వ జాతీయ క్రీడల్లో రాష్ట్రం నుంచి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్, క్రీడాసమాఖ్యల తరఫున క్రీడాకారులు రెండు వేర్వేరు బృందాలుగా వెళ్లనున్నారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే ప్రతిసారీ ఇదే తీరు. రాష్ట్ర క్రీడాసంఘాల మధ్య వివాదాలను పరిష్కరించి, ఆటగాళ్లలో భరోసాను నింపాల్సిన బాధ్యతను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఇటీవల అద్భుతమైన క్రీడా పాలసీని తెచ్చింది. పతకాలు సాధించేవారికి భారీ నజరానాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సంఘాల మధ్య వివాదాల్ని పరిష్కరించి, ఒకే జట్టుగా జాతీయ క్రీడలకు పంపే విషయమై ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ వహించాలని క్రీడాకారులు కోరుతున్నారు.