Comprehensive Household Survey in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఉపాధి, విద్య, ఆర్థిక, రాజకీయ, కులగణన తుది దశకు చేరుకుంది. ఏ రోజుకు ఆ రోజు ఎన్యుమరేటర్లు ఇళ్లకు తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఆన్‌లైన్లో పొందుపరుస్తున్నారు. అలాగే ఇళ్లలో లేని వారికి ఫోన్ చేసి మరీ వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధన ప్రకారం సర్వే చేస్తున్నారు. గ్రామాల్లో ఉండి నగరంలో సెటిల్ అయిన వారు సైతం ఇక్కడే తమ వివరాలను ఇస్తున్నారు. అందుకు సంబంధించిన ధ్రువ పత్రాలను అందిస్తున్నారు.
సర్వే చేసేందుకు బ్లాకులుగా విభజన :ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు పట్టణాలు, 26 గ్రామీణ మండలాలు ఉన్నాయి. ఈ కుటుంబాల వివరాలను సర్వే చేసేందుకు బ్లాకులుగా విభజించారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 నుంచి 175 వరకు కుటుంబాలను కేటాయించి వివరాలు సేకరించే పనిని ఇచ్చారు. కేటాయించిన ప్రకారం ఎన్యుమరేటర్లు వివరాల సేకరించారు. నవంబర్ 6న సర్వే ప్రారంభం కాగా 8వ తేదీ వరకు కుటుంబాలను గుర్తించి గృహాలకు స్టిక్కర్లు అంటించారు. అనంతరం ఇంటింటి సర్వే చేపట్టారు. ఓ వైపు సర్వే కొనసాగుతుండగానే మరో వైపు సేకరించిన సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేసే పనిని ఆపరేటర్లు మొదలు పెట్టారు.