Kaleshwaram Project Inquiry Update :కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలలో ముఖ్యమైన పనులకు సంబంధించి నాణ్యత వ్యవస్థ సరిగా లేదని నిర్వహణలోనూ లోపాలు వెల్లడయ్యాయని నిపుణుల కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. బ్యారేజీలను వాడటం మొదలుపెట్టాక నిర్మాణంలో కొన్ని లోపాలు వెలుగు చూసినా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రంగా పెరిగి మేడిగడ్డ బ్యారేజీకి పైపింగ్ ఏర్పడిందని నివేదిక అభిప్రాయపడినట్లు తెలిసింది.
మేడిగడ్డలో సీకెంట్ ఫైల్స్ పద్ధతిని అమలు చేయాలనుకొనేటప్పుడు దీనిపై తగిన అధ్యయనం చేయలేదని తెలిపినట్లు సమాచారం. మేడిగడ్డ నుంచి నీటిని భారీగా ఎత్తిపోసేందుకు 13 మీటర్ల హైడ్రాలిక్ హెడ్‌ను తీసుకోవడం, 90 రోజులు నీటిని ఎత్తిపోయడానికి బ్యారేజీలో 90 రోజుల పాటు నీరు నిల్వ ఉంచడం వంటి అంశాలను లోపాలుగా నిపుణుల కమిటీ తెలిపినట్లు తెలిసింది.
భారం మొత్తం మేడిగడ్డమీద వేయకుండా తుమ్మిడిహెట్టి నుంచి 60 టీఎంసీల నీటిని మళ్లించే అంశాన్ని పరిశీలిస్తే బాగుండేదని అభిప్రాయపడినట్లు సమాచారం. కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సాంకేతిక అంశాలపై తమకు సాయపడేందుకు నీటిపారుదల శాఖ నిపుణులతో కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది.
మేడిగడ్డ నుంచే 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించడం, పలు దశల్లో లిఫ్టింగ్ ఉండటంతో నిర్వహణ వ్యయం కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పంపింగ్‌కు అవసరమైన అధిక నీటిమట్టం నిర్వహించాల్సి వచ్చినందున బ్యారేజీలను అనివార్యంగా స్టోరేజీ రిజర్వాయర్లుగా మార్చాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా బ్యారేజీ స్ట్రక్చరల్ డిజైన్లలో మార్పులు చేయడంతో నిర్మాణంతోపాటు నిర్వహణలోనూ లోపాలు జరిగాయని కమిటీ పేర్కొన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.