TS Government Committee Formed for Kaleshwaram Project :మేడిగడ్డ ఇతర ఆనకట్టల విషయంలో నిపుణుల కమిటీ సూచనల మేరకే ముందుకెళ్లాలని నిర్ణయించిన సర్కార్, ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల విషయంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆనకట్టలకు తాత్కాలిక చర్యలు, తదుపరి పరీక్షల కోసం ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈఎన్‌సీ జనరల్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు కాగా సభ్యులుగా ఓఅండ్‌ఎమ్ ఈఎన్‌సీ, సీడీఓ సీఈ, రామగుండం సీఈ ఉంటారు. ఈ మూడు ఆనకట్టల విషయంలో చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చేపట్టే చర్యల్లో భాగంగా ఈ కమిటీ ముందుకు సాగనుంది.
ఎన్‌ఎస్‌ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు : బ్యారేజీలకు పరీక్షల కోసం దిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్( సీఎస్‌ఎమ్‌ఆర్‌ఎస్), పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్), హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్‌జీఆర్‌ఐ) సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సూచించింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ఇప్పటికే ఆయా సంస్థలను సంప్రదించింది.
ఎన్‌ఎస్‌ఏ నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షలు నిర్వహించాలని, అందులో భాగంగా మొదట బ్యారేజీలను పరిశీలించాలని కోరింది. సీడబ్ల్యూపీఆర్‌ఎస్ సంస్థ ప్రతినిధులు బుధవారం మూడు ఆనకట్టలను పరిశీలించనున్నారు. ఎన్‌జీఆర్‌ఐ ప్రతినిధులు కూడా ఒకట్రెండు రోజుల్లో పరిశీలన చేస్తారని చెబుతున్నారు. మూడు సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో చర్చించిన తర్వాత, ఎవరితో ఏ పరీక్షలు చేయించాలన్న విషయమై ఓ నిర్ణయానికి వస్తారు.
Kaleswaram Works Started Before Rains Started :వీలైనంత త్వరగా పరీక్షలు ప్రారంభించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేసిన పరీక్షల్లో, కొన్ని వర్షాకాలం కంటే ముందే పూర్తి చేయాల్సి ఉంది. వర్షాలు పడి ఒకసారి బ్యారేజీల్లోకి నీటి ప్రవాహాలు ప్రారంభమైతే ఆ పరీక్షలకు ఆటంకం కలుగుతుంది. అందుకు అనుగుణంగా త్వరితగతిన పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నారు. బ్యారేజీలకు మూడు రకాల పరీక్షలు సూచించిన కమిటీ, పియర్స్ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డకు అదనంగా కాంక్రీట్ నిర్మాణానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయాలని తెలిపింది.