Ancient Columns in Narayanpet District :భూమిపై ఎవరో పాతినట్లు నిలువురాళ్లు ఉన్నాయి. ఈ రాళ్లు వేల ఏళ్ల నాటి ఖగోళ పరిజ్ఞానానికి సాక్ష్యాలుగా చెబుతారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఈ నిలవురాళ్లు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాళ్లకు యునెస్కో జాబితాలోకి చేర్చాలని తెలంగాణ హెరిటేజ్ విభాగం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి ఒక్క రామప్ప దేవాలయానికి మాత్రమే యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కింది. ఈ రాళ్లకు చాలా చారిత్రక నేపథ్యం ఉందని హెరిటేజ్ విభాగం పేర్కొంది.
నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్లో ఈ చారిత్రక నిలువు రాళ్ల ఉన్నాయి. వీటిని యునెస్కో వారసత్వ సంపద జాబితాలో నిలిపేందుకు అడుగులు సైతం వేగంగా పడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన ప్రాచీన కట్టడాలు, విశేషాలున్న ప్రాంతాలు ఉన్న సరైన గుర్తింపు మాత్రం దక్కడం లేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లోని రామప్ప దేవాలయానికే యునెస్కోలో చోటు దక్కింది. నిలువు రాళ్లు, సప్తర్షి మండలంతో ఖగోళ పరిజ్ఞానాన్ని, కాలాలను, వాతావరణ మార్పులను ఆనాడే తెలుసుకునేవారు. దీంతో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
తవ్వకాలకు 90 రోజుల అనుమతులు? : యునెస్కో గుర్తింపునకు అన్ని అర్హతలు ఈ ప్రాంతంలో ఉన్న నిలువు రాళ్లకు ఉన్నాయి. కానీ ఆ స్థాయికి చేర్చాలంటే మాత్రం ఎంతో కసరత్తు అవసరం. ఇప్పటికే వీటి పరిరక్షణకు దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు, తెలంగాణ హెరిటేజ్ విభాగం కృషి చేస్తుండగా.. కానీ యునెస్కో గుర్తింపు దక్కాలంటే మాత్రం సమగ్ర సమాచారం అవసరం అవుతుంది. అందుకే వీటి అధ్యయనానికి దాదాపు 90 రోజుల పాటు తవ్వకాలను చేపట్టేందుకు తెలంగాణ హెరిటేజ్ విభాగం అనుమతి కోరింది. ఈ అనుమతులు త్వరలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు.
తాత్కాలిక జాబితాలో చేర్చాలి : తవ్వకాలకు అనుమతులతో పాటు యునెస్కో గుర్తింపు నిమిత్తం నిలువురాళ్లును తాత్కాలిక జాబితాలో చేర్పించేందుకు కేంద్ర పురావస్తు శాఖకు తెలంగాణ హెరిటేజ్ విభాగం నివేదికలు సమర్పించింది. నిలువురాళ్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని క్రోడీకరించారు. ఆ సమాచారాన్ని వారికి పంపించారు. వీరు పంపిన సందేహాలను ఆ శాఖ పలు సందేహాలను లేవనెత్తింది. వారి ప్రశ్నలకు తెలంగాణ హెరిటేజ్ విభాగం నివేదికలు తయారు చేస్తోంది.