Hydra Focused On FTL Limits In Hyderabad: ఒకవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నీటివనరుల్లోని ఆక్రమణలను కూల్చివేస్తోంది. మరోవైపు ఓఆర్ఆర్ బయటి నుంచి కూడా భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో అక్కడి చెరువులు, ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించింది. ఓఆర్ఆర్ బయట చెరువులకు పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్‌టీఎల్) పరిశీలించి నోటిఫికేషన్లు జారీ చేయడంలో ఐదు జిల్లాల కలెక్టర్లు నిమగ్నమయ్యారు.
ఎఫ్‌టీఎల్‌నిర్ధారించే పనిలో కలెక్టర్లు నిమగ్నం : ఇప్పటికే ఇక్కడ 71 చెరువులకు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. చెరువులకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలతో పాటు మ్యాప్‌లను కూడా జతచేసి హెచ్ఎండీఏకి కలెక్టర్లు పంపించారు. వీటిని నోటిఫై చేసి ఏవైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో తెలపాలని హెచ్ఎండీఏ కోరింది.
చెరువులు, ఇతర నీటి వనరులను సంరక్షించడానికి లేక్ ప్రొటెక్షన్ కమిటీ(ఎల్‌పీసీ) 2010లోనే మొదలైనప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేయలేదు. ఈ కమిటీ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను పరిధి గుర్తించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాలి. 30 రోజుల్లో అభ్యంతరాలను స్వీకరించి తుది నోటిఫికేషన్ జారీ చేయాలి. అనంతరం నీటివనరుల రక్షణ చర్యలు చేపట్టాలి. అయితే అప్పట్లో కొన్ని చెరువులవి మాత్రమే తుది నోటిఫికేషన్ వరకు వచ్చాయి.
నెలరోజుల్లో తుది నిర్ధారణకు ఏర్పాట్లు : ప్రాథమిక నోటిషికేషన్ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వం చెరువుల ఆక్రమణలు తొలగించి వాటిని రక్షించడంతోపాటు ఎఫ్‌టీఎల్‌ను నిర్థారించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. నదులతో పాటు చెరువులు, లేక్‌లు, ఇతర నీటి వనరుల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలను అనుమతించరాదని 2012, 2016లో పురపాలకశాఖ వేర్వేరు జీవోలు ఇచ్చింది. ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, బఫర్‌జోన్‌లు రిక్రియేషన్‌కు సంబంధించినవి మాత్రమేనని పేర్కొంది.