Collector Suspends Two Authorities C-Vigil Complaint Disclosure:సీ- విజిల్ యాప్‌లోని ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైసీపీ నాయకులకు సమాచారం ఇచ్చిన ఘటనలో పంచాయతీ కార్యదర్శి తహసీల్దారు కార్యాలయం జూనియర్ అసిస్టెంట్లపై వేటు పడింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వారి వివరాలు బహిర్గతం కావడంపై ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల చేతికి సీ-విజిల్ ఫిర్యాదు వివరాలు అనే శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన వార్తపై కలెక్టర్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి ఏలూరు జిల్లా చేబ్రోలు గ్రామ సచివాలయం-1 పంచాయతీ కార్యదర్శి బీవీ రవిచంద్రకుమార్, ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ అమృతలను సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఉంగుటూరు ఎంపీడీవో శర్మకు షోకాజ్ నోటీసు ఇచ్చారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు- వెంటనే స్పందించిన అధికారులు
C-vigil Complaint Details to YCP Leaders: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో గ్రంథాలయం, వాటర్ ప్లాంటుకు వైసీపీ రంగులు ఉండటంతో స్థానికుడు ఫొటోలు తీసి సీ-విజిల్ యాప్ ద్వారా ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. ఈ ఫొటోలో ఫిర్యాదు చేసిన వ్యక్తితోపాటు ఆయన స్నేహితుడు కూడా ఉన్నారు. అధికారులు గంటలోపే స్పందించి వాటికి తెల్లరంగు వేయించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచాల్సి ఉన్నా అధికారుల వారి వివరాలను ల్యాప్ టాప్‌లో స్క్రీన్ షార్ట్ తీసి దాన్ని వైసీపీ నాయకులకు పంపించారు. దీంతో ఫిర్యాదుదారుడి స్నేహితుడి సోదరుడికి వైసీపీ నాయకులు ఫోన్ చేసి ప్రశ్నించారు. ఈ విషయం అతనికి తెలియడంతో సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందించి విచారణ చేపట్టారు. సీ- విజిల్ యాప్‌లోని ఫిర్యాదు చేసిన వ్యక్తి విషయాలు బహిర్గతం కావటంలో బాధ్యులైన బొడ్డు రవిచంద్ర కుమార్, తహసీల్దారు కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ అమృతలను కలెక్టర్ సస్పెండ్ చేశారు.