ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణలో పంజా విసురుతున్న చలి- ఆ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - INCREASED COLD IN TELANGANA

తెలంగాణ రాష్ట్రంలో వణికిస్తున్న చలి-మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్.. 30 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ

INCREASED COLD WEATHER IN TG
INCREASED COLD IN TELANGANA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2024, 4:12 PM IST

INCREASED COLD IN TELANGANA:పల్లె, పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు, మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాదు మిట్ట మధ్యాహ్నమూ ఈదురు గాలులు వీస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం రాత్రి సిర్పూర్‌ (యు)లో 9.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలో కెరమెరి, వాంకిడి, ధనోరా, తిర్యాణి, ఆసిఫాబాద్‌ మండలాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంది.
ఈశాన్య ప్రాంతాల నుంచి గాలులు: ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్, భీంపూర్, బోథ్, బేల, ఆదిలాబాద్‌ గ్రామీణం, నేరడిగొండ, మావల మండలాలు వణికిపోతున్నాయి. మధ్య తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కూడా గజగజమంటోంది. కోహీర్‌లో అత్యల్పంగా 9.9 డిగ్రీలు నమోదైంది. గుమ్మడిదల, కంగ్టి, న్యాల్‌కల్, అందోలు, పుల్కల్, జహీరాబాద్, మునిపల్లి మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. పాడి రైతులు చలి నుంచి ఉపశమనం కోసం తమ పశువులను రాత్రంతా నెగళ్ల వద్ద కట్టేస్తున్నారు. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కన్నా తగ్గుముఖం పట్టాయి. మహబూబ్‌నగర్, రామగుండంలలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు, హనుమకొండలో 2.6 డిగ్రీలు, హైదరాబాద్‌లో 1.2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి తెలంగాణవైపు గాలులు వీస్తుండటమే రెండు రోజులుగా రాష్ట్రంలో శీతల వాతావరణం ఏర్పడటానికి కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయుడుతున్నారు.

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో కొన్ని మండలాల్లో 10 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని సూచిస్తూ ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. 30 జిల్లాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. వీటికి పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది.

రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్ జారీ:రాష్ట్రంలో ఆరెంజ్, పసుపు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు, వ్యాధులతో బాధపడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకుని మధ్యాహ్నం సమయంలోనే రాకపోకలు సాగించాలని పేర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల వారు వెచ్చని వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చలితోపాటు ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. ఆరెంజ్‌ హెచ్చరికలు ఉన్న జిల్లాల్లో పర్యవేక్షణ ఉండాలని పేర్కొంటున్నారు. ఏటా డిసెంబరులో ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువ స్థాయికి పడిపోతాయి. ఈ ఏడాది కొన్ని జిల్లాల్లో నవంబరులోనే ఆ పరిస్థితి నెలకొంది. గత పదేళ్లతో పోల్చితే ఈ నెల 23వ తేదీ రాత్రి నాలుగు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 12 డిగ్రీలు, హనుమకొండలో 12.9, మహబూబ్‌నగర్‌లో 13.4, నల్గొండలో 13.6 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

అల్లూరిలో చలి పులి.. మూగజీవాలు సైతం గజగజ.. చలిమంటలతో ఉపశమనం

Temperatures dropped in Hyderabad: రాబోయే రోజుల్లో చలి మరింత తీవ్రం.. హెచ్చరించిన ఐఎండీ..

ABOUT THE AUTHOR

...view details